'మా నమ్మకం నువ్వే జగన్'... ఆకట్టుకుంటున్న వైసీపీ స్ట్రాటజీ
సీఎం జగన్ ఇప్పటికే 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి కొనసాగింపుగానే.. ఈ సరికొత్త కార్యక్రమం మొదలవుతోంది.
ఏపీలో రెండో సారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న సీఎం వైఎస్ జగన్, వైసీపీ పార్టీ సరికొత్త స్ట్రాటజీకి తెరలేపిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తున్నది. సరికొత్త ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసి ముందుకు పోతోంది.
గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన వర్గాలను ఆకట్టుకోవడానికి బడ్జెట్‌లో వరాలు ప్రకటించి.. వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయింయింది. ఇన్ని చేసినా రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామో లేదో అనే సందిగ్దత వైసీపీ శ్రేణుల్లో ఉన్నది. ఇదే అనుమానం సీఎం జగన్‌లో కూడా ఉన్నట్లు ఉంది. అందుకే ఇటీవల ప్రజల నాడిని తెలుసుకునే కార్యక్రమాలను ప్రారంభించారు.
సీఎం జగన్ ఇప్పటికే 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్ని పథకాలు అమలు చేసినా.. ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. అంతే కాకుండా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులపై ఫిర్యాదులు కూడా నమోదవుతుంటాయి. వీటన్నింటిన్నీ నమోదు చేయడానికి ఇప్పటికే ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లలో 'స్పందన' పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు.
అయితే స్పందన విషయంలో సరైన యంత్రాంగం లేదని ఆలోచించిన వైఎస్ జగన్ తాజాగా 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ వారం ప్రతీ జిల్లాల నుంచి ప్రజల ఫిర్యాదులను నేరుగా సీఎంవోకే తెప్పించుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మరో కార్యక్రమానికి కూడా రూపకల్పన చేసినట్లు తెలుస్తున్నది. పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ అధిష్టానం అనుమతితో ఒక కార్యక్రమం చేపట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ తిరుగుతూనే 'మా నమ్మకం నువ్వే జగన్' అనే స్టిక్కర్లను అంటించారు.
ఇది ప్రజల్లోకి బలంగా చొచ్చుకొని పోతోంది. ఇదే విషయాన్ని వైసీపీ అధిష్టానానికి తెలియజేసి.. ఇలాంటి కార్యక్రమమే రాష్ట్రమంతటా చేస్తే మంచి మైలైజీ వస్తుందని కూడా సలహా ఇచ్చారు. కాటసాని సలహాను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ ఇకపై ఇదే పేరుతో రాష్ట్రంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ చేసింది.
'మా నమ్మకం నువ్వే జగన్' పేరుతో ప్రతీ ఇంటా స్టిక్కర్లు అంటించాలని... ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందిన ప్రతీ ఇంటి ముందు గోడకు ఇవి ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఎన్నికలకు మరో ఏడాదిన్నరే ఉన్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరికి వైసీపీ, సీఎం జగన్‌ను మరో సారి ఈ కార్యక్రమం ద్వారా దగ్గర చేయాలని భావిస్తోంది. మరి ఈ పథకం ఎంత వరకు సఫలం అవుతుందో చూడాలి.