వైసీపీలోకి ఉధృతంగా చేరికలు.. అందరికీ జగన్ తోనే కండువాలు
ఎన్నికల సమయం దగ్గరపడేసరికి వైసీపీ వ్యూహం మార్చింది. నేరుగా జగన్ అపాయింట్ మెంట్ దొరుకుతుందనే సరికి చాలామంది వైసీపీ వైపు వచ్చేస్తున్నారు.
2014 నుంచి 2019 వరకు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ఉధృతంగా ఉండేవి, కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అటునుంచి ఇటు చేరికలను జగన్ పెద్దగా ప్రోత్సహించలేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ వైపు వచ్చినా కూడా వారి సంఖ్య పరిమితం. ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ మొదలయ్యే సరికి వైసీపీలో కూడా చేరికలు జోరందుకున్నాయి. నియోజకవర్గాలకు సంబంధించి చోటా మోటా నేతలు కూడా నేరుగా జగన్ సమక్షంలోనే కండువాలు వేసుకుంటున్నారు. జగన్ కూడా చేరికల విషయంలో వ్యూహం మార్చారు, స్పీడ్ పెంచారు.
చేరికలనేవి పార్టీ బలం పెంచడానికే కాదు, ప్రత్యర్థుల్లో గుబులు రేకెత్తించడానికి కూడా పనికొస్తాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై వైసీపీ పెద్దగా దృష్టిసారించలేదు. తీరా ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడేసరికి వైసీపీ వ్యూహం మార్చింది. నేరుగా జగన్ అపాయింట్ మెంట్ దొరుకుతుందనే సరికి చాలామంది వైసీపీ వైపు వచ్చేస్తున్నారు. వారందర్నీ స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు నేరుగా జగన్ వద్దకు తీసుకొచ్చి మెడలో కండువా వేస్తున్నారు. తాజాగా పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు వైసీపీలోకి వచ్చారు, స్వయంగా వారికి జగన్ కండువా కప్పారు.
నియోజకవర్గాల్లో కండువాల పండగ..
ఇక నియోజకవర్గాల్లో ఇలాంటి కండువాల పండగలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల టైమ్ లో గ్రామాలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేల వద్ద ఇలాంటి పరేడ్ లు నిర్వహిస్తుంటారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యవహారం ఇప్పుడు జోరందుకుంది. ఒకరోజు టీడీపీలో, మరో రోజు అదే బ్యాచ్ వైసీపీలో.. ఇలా ఉంటోంది కొన్ని చోట్ల వ్యవహారం. పార్టీలో ఉన్నవారికి కూడా మళ్లీ మళ్లీ కండువాలు కప్పి ఫొటోలు దిగడం కూడా ఇప్పుడు ప్రచారంలో ఓ భాగమైపోయింది. కొత్తగా కండువాలు వేసుకున్నవారంతా.. ఎన్నికల వేళ ఆయా పార్టీలకు ఏమేరకు ఉపయోగపడతారో చూడాలి.