Telugu Global
Andhra Pradesh

మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పుంగనూరులో ఉద్రిక్తత

మిథున్ రెడ్డిని పుంగనూరు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. తిరుపతిలో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు.

మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పుంగనూరులో ఉద్రిక్తత
X

వారం రోజుల క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు పర్యటన ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడింది. ఆయన్ను పుంగనూరుకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల పుంగనూరు మున్సిపాల్టీకి సంబంధించి చైర్మన్ సహా 13మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో పుంగనూరు రాజకీయం వేడెక్కింది. తాజాగా స్థానిక నేతల్ని కలిసేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడికి వెళ్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసులు చెబుతున్నారు. మిథున్ రెడ్డిని పుంగనూరు వెళ్లకుండా అడ్డుకున్నారు. తిరుపతిలో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు.

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని, వైసీపీ కార్యకర్తల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఒక ఎంపీగా తన నియోజకవర్గ ప్రజల్ని కలిసే హక్కు తనకు లేదా అని ప్రశ్నించారు. తనను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారని, దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు మిథున్ రెడ్డి.


తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారాయన. పెద్దిరెడ్డి కుటుంబాన్ని తిడితే పదవులు వస్తాయని కొంతమంది టీడీపీ నేతలు అనుకుంటున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము ప్రజలకు అందుబాటులోనే ఉంటామన్నారు మిథున్ రెడ్డి. కార్యకర్తలకు అండగా నిలబడతామన్నారు. పార్టీ మారాలంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఒత్తిడి తెస్తున్నారని, జేసీబీలు తీసుకొచ్చి ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి.

First Published:  30 Jun 2024 10:40 AM IST
Next Story