Telugu Global
Andhra Pradesh

విచారణకు వస్తా, కానీ..!! సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ

విచారణ ప్రక్రియను రికార్డు చేసేందుకు అనుమతించాలన్నారు. తనతోపాటు న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. అయితే అవినాష్‌ లేఖకు సీబీఐ ఇంకా సమాధానం ఇవ్వలేదు.

విచారణకు వస్తా, కానీ..!! సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ
X

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు సీబీఐ ముందు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. గతంలో ఓసారి పనులున్నాయని విచారణను పోస్ట్ పోన్ చేయించుకున్న అవినాష్ రెడ్డి, ఈరోజు సీబీఐ ముందు హాజరయ్యేందుకు పులివెందులనుంచి బయలుదేరారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐకి రాసిన తాజా లేఖ ఇప్పుడు ఆసక్తిగా మారింది. విచారణకు వస్తాను కానీ అంటూ చిన్న మెలిక పెట్టారు అవినాష్ రెడ్డి. తన లాయర్ కూడా తనతోపాటు విచారణ సమయంలో ఉండాలని సీబీఐని కోరారు.

నా ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు..

ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా ఈ కేసులో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని గతంలో ఆరోపణలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్పుడు కూడా ఆయన అవే ఆరోపణలను సీబీఐకి లేఖ రూపంలో పంపించారు. వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు. విచారణ ప్రక్రియను రికార్డు చేసేందుకు అనుమతించాలన్నారు. తనతోపాటు న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. అయితే అవినాష్‌ లేఖకు సీబీఐ ఇంకా సమాధానం ఇవ్వలేదు.

విచారణ జరుగుతుందా..?

సీబీఐ విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ చేసిన తర్వాత తొలిసారిగా అవినాష్ రెడ్డికి నోటీసులందాయి. సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద అవినాష్‌ రెడ్డికు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ఎంపీగా తన అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత అందుబాటులోకి వస్తానన్నారాయన. సీబీఐ కూడా ఆయన చెప్పిన సమయానికే మళ్లీ నోటీసు ఇచ్చి ఈరోజు విచారణకు మహూర్తం ఫిక్స్ చేసింది. ఈలోగా విచారణను రికార్డ్ చేయాలి, న్యాయవాది కావాలంటూ అవినాష్ రెడ్డి లేఖ రాయడంతో కలకలం రేగింది. ఆయన సీబీఐ ముందు హాజరవుతారా, లేక తన విజ్ఞప్తిని మన్నించనందుకు గైర్హాజరవుతారా అనేది తేలాల్సి ఉంది. ఈరోజు సీబీఐ విచారణ సమయానికి ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.

First Published:  28 Jan 2023 12:31 PM IST
Next Story