వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ గుడ్ బై..!
రాజకీయ నాయకుల్లో ఒక్కొకరికీ ఒక్కో స్థాయి అసంతృప్తి. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీకృష్ణ ఇప్పుడు పార్టీకి దూరం కాబోతుండటం విశేషం.
ఏపీలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండగా కీలక నేతలు ఒక్కొక్కరే వైసీపీకి దూరంగా జరుగుతుండటం విశేషం. అయితే అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఆశించిన టికెట్ దొరకదని తేలిపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు నేతలంతా. కొంతమంది జగన్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు, మరికొందరు పార్టీ ప్రకటన కంటే ముందే సేఫ్ గేమ్ మొదలు పెడుతున్నారు. అలాంటి వారిలో విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఒకరు. వైసీపీ తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఎంపికైన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ నాయకుల్లో ఒక్కొకరికీ ఒక్కో స్థాయి అసంతృప్తి. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీకృష్ణ ఇప్పుడు పార్టీకి దూరం కాబోతుండటం విశేషం. 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తన సత్తా చూపించాలని ఉవ్విళ్లూరారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయనకు ఆ టికెట్ దొరకదనే విషయం తేలిపోయింది. గతంలో విశాఖ మేయర్ పదవిపై ఆశపడితే అప్పుడు కూడా అధిష్టానం తనకు అవకాశమివ్వలేదనే అసంతృప్తి వంశీకృష్ణలో ఉంది. అందుకే ఆయన జనసేనవైపు చూస్తున్నారు. జనసేన నుంచి వంశీ గాజువాక నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి పవన్ కల్యాణ్ గాజువాకలో పోటీ చేయకపోతే ఆ స్థానం వంశీకృష్ణకు ఇచ్చే అవకాశముంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు వంశీకృష్ణ. ప్రజారాజ్యంతో ఉన్న ఆ సాన్నిహిత్యంతోనే ఇప్పుడు ఆయన జనసేనలో చేరబోతున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మార్పు వ్యవహారంపై స్ధానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా స్పందించడం విశేషం. ఎమ్మెల్సీ పార్టీ మారితే అది రాజకీయ ఆత్మహత్య అనుకోవాల్సిందేనన్నారు గుడివాడ. వంశీ పార్టీ మారుతున్నారనే వార్తలపై తన దగ్గర సమాచారం లేదని చెప్పారు. మొత్తానికి వైసీపీలో మరో వికెట్ పడబోతోందనే విషయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.