అంజూ యాదవ్ కి వైసీపీ నుంచి ఊహించని మద్దతు..
పవన్ కి చిత్తశుద్ధి ఉంటే సీఐ అంజూయాదవ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ఆత్మ స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి..
గత కొన్నిరోజులుగా సీఐ అంజూ యాదవ్ టాక్ ఆఫ్ ది ఏపీగా మారారు. జనసేన నేతలపై ఆమె చేయి చేసుకోవడం, ఆమెకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇవ్వడం, ఏకంగా ఆమెపై ఫిర్యాదు చేసేందుకు జనసేనాని తిరుపతి రావడం.. ఇలా వరుస ఎపిసోడ్ లతో అంజూ యాదవ్ అనే పేరు మారుమోగిపోయింది. సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ఆమె పాత వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఈ దశలో అంజూ యాదవ్ కి యాదవ, బీసీ సంఘాలనుంచి ఊహించని మద్దతు లభించింది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఆమెకు మద్దతు పలికారు. పవన్ కల్యాణ్, అంజూ యాదవ్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.
ఓ మహిళ అని కూడా చూడకుండా సీఐ అంజూయాదవ్ ని పవన్ కల్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీఐ చేయి చేసుకున్నారని, విధులు సక్రమంగా నిర్వర్తించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. పవన్ కి చిత్తశుద్ధి ఉంటే సీఐ అంజూయాదవ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ఆత్మ స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. పవన్ లాంటి రౌడీ షీటర్లకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు వ్యవస్థ బలంగా ఉండాలన్నారు శ్రీకాంత్ రెడ్డి.
రాజకీయం అంటే ఒక బాధ్యత అని, ఊగిపోతూ మాట్లాడటం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదని పవన్ కి హితవు పలికారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ధైర్యం ఉంటే 2014లో టీడీపీ మేనిఫెస్టోను కార్యకర్తల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 14 ఏళ్ళ పాలన, జగన్ నాలుగేళ్ల పాలన పై చర్చకు సిద్ధమా అంటూ పవన్ కి సవాల్ విసిరారు. చంద్రబాబు ఎంతో మందిని బలి పశువులను చేశారని, ఈ సారి చంద్రబాబు చేతిలో పవన్ బలి పశువు అయ్యారని ఎద్దేవా చేశారు. వేదిక ఎక్కి చెప్పులు చూపించటం, తోలు తీస్తా, తాట తీస్తా అనడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి.