ముందు జనసేన, తర్వాత బీజేపీ.. వైసీపీ ఎమ్మెల్యే ఆపసోపాలు
ఒకవేళ టీడీపీ ఆ సీటుని కూటమికి త్యాగం చేసినా వరప్రసాద్ కి ఛాన్స్ దొరుకుతుందో లేదో చూడాలి. ఆయన మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఏదయినా టికెట్ మాత్రం తనకే ఇవ్వాలని కోరుతున్నారు వరప్రసాద్.

సంక్షేమ పథకాల అమలులో తాను బిజీగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లి పార్టీకి మంచి పేరు తేవాలని ఆశించారు సీఎం జగన్. ఆ పని చేయని వారిని, జనంతో మమేకం కాలేని వారిని ముందుగానే పక్కనపెట్టారు. రిజెక్టెడ్ అనే ముద్రవేసి వారికి ప్రత్యామ్నాయాల్ని సిద్ధం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కి కూడా టికెట్ ఇవ్వలేనని ముందుగానే చెప్పేశారు జగన్. దీంతో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కలిశారు, అక్కడ వర్కవుట్ కాకపోయే సరికి కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో చేరిపోయే సరికి పురందరేశ్వరిని కాకా పట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
వైసీపీకి రాజీనామా చేశానంటున్న వరప్రసాద్ కూటమి తరపున తిరుపతి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. 2014లో ఆయన వైసీపీ తరపున తిరుపతి ఎంపీగా పనిచేశారు. 2019లో గూడూరు నియోజకవర్గానికి పరిమితం చేయడంతో అయిష్టంగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ వేవ్ లో గెలిచారు. కానీ స్థానికంగా ఆయన పట్టు సాధించలేకపోయారు, ఎప్పుడూ పంచాయితీలే జరిగేవి. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం కూడా గూడూరులో బలంగా ఉంది. దీంతో జగన్, ఎమ్మెల్యే వరప్రసాద్ ని సున్నితంగా పక్కనపెట్టేశారు. ఆల్రడీ ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళికి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేశారు. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ అక్కడ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక చేసేదేమీ లేక వరప్రసాద్ ఎక్కే గడప, దిగే గడప అన్నట్టుగా జనసేన, బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు, తిరుపతి ఎంపీ సీటు ఇప్పించాల్సిందిగా బతిమిలాడుకుంటున్నారు.
తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానం. అక్కడ వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి తిరిగి పోటీ చేయబోతున్నారు. టీడీపీ తరపున పనబాక లక్ష్మికి టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టీడీపీ ఆ సీటుని కూటమికి త్యాగం చేసినా వరప్రసాద్ కి ఛాన్స్ దొరుకుతుందో లేదో చూడాలి. ఆయన మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఏదయినా టికెట్ మాత్రం తనకే ఇవ్వాలని కోరుతున్నారు వరప్రసాద్.