Telugu Global
Andhra Pradesh

కొండపై రచ్చ.. టీటీడీ ఈవోపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీస్ అంటే కూడా ఈవోకి లెక్క లేకుండా పోయిందన్నారు ఎమ్మెల్యే రాంబాబు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

కొండపై రచ్చ.. టీటీడీ ఈవోపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
X

తిరుమలలో తమకు కనీస మర్యాదలు జరగలేదని ఏపీ ఎమ్మెల్యే హడావిడి చేశారు. ఈవోపై ధ్వజమెత్తారు. సహజంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తమకు మర్యాదలు జరగలేదని అంటే దానికో అర్థముంది. కానీ ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. దర్శనాల విషయంలో కలిగిన అసంతృప్తిపై ఆయన రచ్చకెక్కడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది.

శాసన సభ్యుడికి కనీస మర్యాదలు కూడా ఇవ్వలేదని, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడతో వెళ్తున్నాని మండిపడ్డారు వైసీపి ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవోపై మండిపడ్డారు. సామాన్య భక్తులను బూచిగా చూపిస్తూ టీటీడీ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీస్ అంటే కూడా ఈవోకి లెక్క లేకుండా పోయిందన్నారు ఎమ్మెల్యే రాంబాబు. ధర్మారెడ్డి ఈవోగా కొనసాగాలని ఎలా తపన పడుతున్నారో, అదే విధంగా తామంతా స్వామి వారిని దర్శించుకోవాలనే కోరికతో ఉన్నామని చెప్పుకొచ్చారు రాంబాబు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

అందరికీ ఒకేరూల్ పెడితే పోలా..

తిరుమలలో భక్తులందరికీ ఒకే రూల్ పెడితే తాము కూడా సామాన్య భక్తుడిలాగే స్వామి వారిని దర్శనం చేసుకుంటామని అన్నారు ఎమ్మెల్యే రాంబాబు. వీఐపీ దర్శనం ఉన్నా కూడా తమను అసౌకర్యానికి గురి చేయడం సరికాదంటున్నారు. టీటీడీ అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు రాంబాబు.

First Published:  26 March 2023 4:43 PM IST
Next Story