Telugu Global
Andhra Pradesh

మా నమ్మకం నువ్వే, కానీ ఆ ఎమ్మెల్యే మాకొద్దు..

చాలామంది స్థానిక నాయకులపై అసంతృప్తి వెళ్లగక్కడానికి భయపడుతున్నారు. ఇప్పుడు వారందరికీ జగనన్నే దారి చూపించారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే పోస్టర్ల కార్యక్రమం వచ్చాక, ఊరూవాడా చిత్ర విచిత్రమైన పోస్టర్లు పడుతున్నాయి.

మా నమ్మకం నువ్వే, కానీ ఆ ఎమ్మెల్యే మాకొద్దు..
X

ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ క్రియేటివిటీ కనిపించేది. ఇప్పుడు ఏపీలో స్టిక్కర్ల రాజకీయం మొదలయ్యాక.. ఆ క్రియేటివిటీ అంతా రోడ్లపై, గోడలపై, కరెంట్ పోల్స్ పై కనపడుతోంది. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ అధికారికంగా మొదలైన కార్యక్రమం.. చివరకు రకరకాలుగా మారిపోయింది. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మా నమ్మకం నువ్వే జగనన్న, కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పై మాకు నమ్మకం లేదు అంటూ పోస్టర్లు వేశారు కొంతమంది.

రాజంపేటలో కరెంట్ పోల్స్ పై, స్థానిక టిఫిన్ బండ్లపై, మరికొన్ని ప్రాంతాల్లో ఈ రకంగా వాల్ పోస్టర్లు వేశారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వ్యతిరేక వర్గం ఈ పోస్టర్లు వేసినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ పై తమకు నమ్మకం ఉందని చెబుతూనే.. పరోక్షంగా ఆ ఎమ్మెల్యే తమకి వద్దు అంటున్నారు. అంటే ఎమ్మెల్యేని మార్చేయాలనేదే వారి ఉద్దేశం, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దనేదే వారి వేడుకోలు. మోసపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంటూ పోస్టర్ల కింద రాయడం దీనికి కొసమెరుపు.




ఇప్పటి వరకూ స్థానిక నాయకులపై తమ అసంతృప్తి ఎలా తెలియజేయాలా అని చాలామంది ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టింగ్ లకు పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా ఎవరు ఆ పోస్ట్ లు పెట్టారో ఇట్టే తెలుసుకోవచ్చు. ఫేక్ అకౌంట్లతో పోస్టింగ్ లు పెట్టినా, పోలీస్ కేసు పెడితే కచ్చితంగా ఎంక్వయిరీ మొదలు పెడతారు. దీంతో చాలామంది స్థానిక నాయకులపై అసంతృప్తి వెళ్లగక్కడానికి భయపడుతున్నారు. ఇప్పుడు వారందరికీ జగనన్నే దారి చూపించారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే పోస్టర్ల కార్యక్రమం వచ్చాక, ఊరూవాడా చిత్ర విచిత్రమైన పోస్టర్లు పడుతున్నాయి. టీడీపీ, జనసేన కూడా ఎవరి డప్పు వారు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు స్వపక్షంలోని విపక్షం.. పోస్టర్లతో రోడ్డునపడింది.

First Published:  11 April 2023 3:53 PM IST
Next Story