Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డికి జగన్ తలంటు.. పరిధి దాటలేదని ఎమ్మెల్యే వివరణ

కోటంరెడ్డి మీడియాతో మాట్లాడటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని తమ సమావేశంలో ఎమ్మెల్యేకి గుర్తు చేశారు సీఎం జగన్. పింఛన్లు తొలగించిన మాట వాస్తవమే అయినా, రీ వెరిఫికేషన్ తర్వాత అర్హులకు తిరిగి ఇచ్చారని, కొత్త పింఛన్లు కూడా వచ్చాయని ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో చెప్పడం గమనార్హం.

కోటంరెడ్డికి జగన్ తలంటు.. పరిధి దాటలేదని ఎమ్మెల్యే వివరణ
X

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా తాడేపల్లి పిలిపించి మరీ భేటీ అయిన సీఎం జగన్.. గడప గడప కార్యక్రమంపై ఆయనకు పలు సూచనలు చేశారు. ఇటీవల అనారోగ్యంనుంచి కోలుకున్న కోటంరెడ్డి గడప గడప కార్యక్రమంలో చిన్న చిన్న మార్పులు చేశారు. నేరుగా ప్రతి గడపకి వెళ్లకుండా సచివాలయ పరిధిలో సమావేశాలు పెట్టి మాట్లాడేవారు. అయితే గడప గడపలో ప్రతి ఇంటికీ వెళ్లాలని, కేవలం సమావేశాలు మాత్రమే పెట్టొద్దని సీఎం జగన్, ఎమ్మెల్యే కోటంరెడ్డికి సూచించారట. ఆ ప్రకారమే నడుచుకుంటానని, రాబోయే రోజుల్లో గడప గడప కార్యక్రమాన్ని ఉధృతం చేస్తానంటూ సీఎంకి మాటిచ్చినట్టు మీడియా సమావేశంలో తెలిపారు ఎమ్మెల్యే.

పింఛన్ల విషయంలోనూ..

ఇక సామాజిక పింఛన్ల కోత విషయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిరంగంగానే అధికారులపై విమర్శలు సంధించారు. తన నియోజకవర్గ పరిధిలో 2700 పింఛన్లు తీసేశారని, వారంతా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని, ఏ ఒక్కరికీ పింఛన్ ఆపకూడదని అన్నారు. ఆయన మాటల్ని ప్రతిపక్షాలు కూడా బాగానే వాడుకున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేనే పింఛన్లు కట్ చేశారని చెబుతున్నారు చూడండి అంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు టీడీపీ నేతలు. ఆ తర్వాతి రోజే సీఎం జగన్, ప్రతిపక్షాలు పింఛన్ల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అనర్హులకే పింఛన్లు తగ్గిస్తున్నామని, అర్హులకు కొత్త పింఛన్లు ఇస్తున్నామని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని తమ సమావేశంలో ఎమ్మెల్యేకి గుర్తు చేశారు సీఎం జగన్. పింఛన్లు తొలగించిన మాట వాస్తవమే అయినా, రీ వెరిఫికేషన్ తర్వాత అర్హులకు తిరిగి ఇచ్చారని, కొత్త పింఛన్లు కూడా వచ్చాయని ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో చెప్పడం గమనార్హం.

రాజకీయం చేయొద్దు, మానవీయ కోణంలో చూడండి..

జిల్లా మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి రోడ్ల సమస్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, తనకు అధికారులు సహకరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలు కూడా సీఎం దగ్గర చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మాట్లాడారు, అందులో ఏ మాత్రం తప్పులేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిఉండి కూడా ఆయన నిర్భయంగా తన గళం వినిపించారు, అధికారులు సహకరించడంలేదని కుండబద్దలు కొట్టారు. అయితే ఆయన మాటల్ని ప్రతిపక్షాలు హైలెట్ చేయడంతోనే అసలు సమస్య మొదలైంది. దీంతో సీఎం నేరుగా పిలిపించి మరీ కొన్ని సూచనలు చేశారు. వ్యతిరేక వ్యాఖ్యలు చేసే ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారిని జగన్ ఎప్పుడూ పిలిపించి మాట్లాడలేదు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాత్రం ఆయన పిలిచి చర్చలు జరిపారు. దీంతో ఎమ్మెల్యే మెత్తబడ్డారు. తానెప్పుడూ పార్టీ లైన్ దాటి మాట్లాడలేదని, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడూ వెనకాడలేదని మీడియా సమావేశంలో వివరించారు. తన వ్యాఖ్యల్ని రాజకీయం చేయొద్దని, మానవీయ కోణంలో చూడాలని మీడియాని అభ్యర్థించారు.

First Published:  2 Jan 2023 11:42 PM GMT
Next Story