చిరంజీవితో పవన్ కు పోలికా..? వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
తాను లోకల్ అని, స్థానికంగా ఉన్న తనను తరిమికొట్టాలి అనడం పవన్ కల్యాణ్ అవివేకం అని అన్నారు ఎమ్మెల్యే గ్రంధి. పవన్ కు మతిస్థిమితం లేదని, ఆయన్ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని సూచించారు.
చిరంజీవి సౌమ్యుడు, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారని.. పవన్ కల్యాణ్ అలా కాదని తాను రెండు చోట్ల ఓడిపోవడమే కాకుండా, పార్టీ తరపున గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా కోల్పోయారని ఎద్దేవా చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పవన్ కల్యాణ్ వైఖరి నచ్చకే జనసేన నుంచి చాలామంది కీలక నేతలు బయటకు వచ్చేశారని అన్నారు. అసలు చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు పోలికే లేదన్నారు ఎమ్మెల్యే గ్రంధి.
భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు చేరిక సభలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భీమవరం ఎమ్మెల్యే ఓ రౌడీ అని, ఆయన్ను తరిమేయాలని పిలుపునిచ్చారు పవన్. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గ్రంధి కూడా అంతే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తనపై ఒక్క పోలీస్ కేసు కూడా లేదని, తాను రౌడీనెలా అవుతానని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేదని, ఆయన్ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని సూచించారు. సొంత అన్న నాగబాబుకి కూడా పవన్ అన్యాయం చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే గ్రంధి.
నన్నే తరిమి కొడతావా..?
తాను లోకల్ అని, స్థానికంగా ఉన్న తనను తరిమికొట్టాలి అనడం పవన్ కల్యాణ్ అవివేకం అని అన్నారు ఎమ్మెల్యే గ్రంధి.తనకు భీమవరంలో 9 ఎకరాల భూమి ఉందని, జనసేన పార్టీ ఆఫీస్ కోసం స్థలం కావాలంటే అందులో కొంత భూమి అమ్మేవాడిని కదా అని కౌంటర్ ఇచ్చారు. గతంలో పవన్ పక్కనే ఉన్న కాపు నేతలు ఇప్పుడు ఆయన్ను ఎందుకు దూరం పెడుతున్నారో ఆలోచించుకోవాలన్నారు. తాను తరిమితే పారిపోయేవాడిని కాదని, తన రక్తంలోనే ప్రజా సేవ ఉందన్నారు. 2019లో భీమవరం ప్రజలు పవన్ కల్యాణ్ ను తరిమి తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు.