Telugu Global
Andhra Pradesh

కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. ఆర్కే ఎపిసోడ్ రిపీట్ అవుతుందా..?

అన్ని పార్టీల డోర్స్ క్లోజ్ అయిన తర్వాత, ఆర్థర్ లాంటి వారు మాత్రమే కాంగ్రెస్ లోకి వస్తున్నారు. వీరి వల్ల ఆ పార్టీకి ఏమేరకు లాభం చేకూరుతుందో చూడాలి.

కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. ఆర్కే ఎపిసోడ్ రిపీట్ అవుతుందా..?
X

నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ టికెట్ పై ఆర్థర్ నందికొట్కూరు ఎమ్మెల్యే స్థానానికి తిరిగి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ జాబితాపై ఇంకా కసరత్తులు జరుగుతున్నాయి. అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. అనుకోకుండా నందికొట్కూరుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ కి దొరికారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన వెంటనే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఆయన కొన్నిరోజులకే తన మనసు మార్చుకున్నారు. తిరిగి జగన్ వైపు వచ్చేశారు. ఆర్కే కోరిక మేరకు మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిని మార్చారు జగన్. తన మాట నెగ్గించుకున్న ఆర్కే తిరిగి వైసీపీ గెలుపుకోసం పనిచేస్తున్నారు. ఆర్కే ఎపిసోడ్ తర్వాత ఇప్పటి వరకూ ఇంకెవరూ ఆ ప్రయత్నం చేయలేదు. వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లిన రెండో ఎమ్మెల్యే ఆర్థర్. ఆర్కేలాగా ఆర్థర్ కి కూడా కాంగ్రెస్ తత్వం బోధపడుతుందేమో చూడాలి. ఏపీలో కాంగ్రెస్ పిలిచి టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. షర్మిల వచ్చినా కూడా కాంగ్రెస్ బలం ఏమాత్రం పెరగలేదనేది వాస్తవం. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనపడింది. అందుకే ఆయన హస్తం గూటికి చేరుకున్నారు.

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్లంతా ఆ పార్టీలోకి క్యూ కడతారని ఎల్లో మీడియా వార్తలిచ్చింది. జగన్ పై షర్మిల చేస్తున్న విమర్శలన్నిటినీ హైలైట్ చేసింది. జగన్ కి వ్యతిరేకంగా షర్మిల చేసే వ్యాఖ్యలు పరోక్షంగా టీడీపీకి ఉపయోగపడతాయనేది ఎల్లో మీడియా ఆలోచన. షర్మిలకు ఎవరెంత హైప్ ఇచ్చినా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. షర్మిల వచ్చినా కూడా సీనియర్లెవరూ కాంగ్రెస్ వైపు చూడలేదు. రాగా పోగా అన్ని పార్టీల డోర్స్ క్లోజ్ అయిన తర్వాత, ఆర్థర్ లాంటి వారు మాత్రమే కాంగ్రెస్ లోకి వస్తున్నారు. వీరి వల్ల ఆ పార్టీకి ఏమేరకు లాభం చేకూరుతుందో చూడాలి.

First Published:  19 March 2024 3:01 PM IST
Next Story