నాకూ ఆఫర్ వచ్చింది.. వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే
200కోట్ల రూపాయలు ఓవైపు, జగన్ ఫొటో మరోవైపు పెడితే.. తాను జగన్ ఫొటోనే తీసుకుంటానని చెప్పారు ఎమ్మెల్యే ఆర్థర్. ఎమ్మెల్యే తనకు ఆఫర్ వచ్చిందన్నారు కానీ, అసలు బేరం జరిగిందో లేదో చెప్పడంలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి 4 ఓట్లు క్రాస్ అయ్యాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ నాలుగు ఓట్లు ఫలానావారివి అని వైసీపీ ఓ లిస్ట్ చదివి వినిపించింది, వారిని పార్టీనుంచి తొలగించింది. ఆ నలుగురితోపాటు టీడీపీ మరికొందరికి కూడా ఆఫర్ ఇచ్చినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు వైసీపీలో ఉన్నవారు నాకు ఆఫర్ వచ్చింది, నాక్కూడా ఆఫర్ వచ్చింది అంటూ బయటకొస్తున్నారు.
రాపాక వరప్రసాద్ తనకి 10కోట్ల ఆఫర్ వచ్చిందని, సిగ్గు, శరం ఉంది కాబట్టి ఆ ఆఫర్ ని తాను తిరస్కరించానన్నారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి.. తనకు కూడా ఫోన్ కాల్స్ వచ్చాయని, కానీ తాను జగన్ కే జై కొడతానని చెప్పానని, అదే చేశానని చెప్పుకొచ్చారు. వీరిద్దరూ జనసేన, టీడీపీ నుంచి వచ్చినవారే కదా అనుకుంటే.. ఇప్పుడు నిఖార్సయిన వైసీపీ ఎమ్మెల్యే కూడా తన ఆఫర్ ని బయటపెట్టారు. కోట్ల రూపాయల ఆఫర్ తో తనను కూడా ప్రలోభపెట్టాలని చూశారని కానీ వారికే వార్నింగ్ ఇచ్చి తాను ఫోన్ పెట్టేశానని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఇంటికి పోలింగ్ ముందురోజు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారట. సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడారని, అక్కడినుంచే తనకు ఫోన్ చేసి పర్సనల్ గా మాట్లాడాలన్నారని చెప్పుకొచ్చారు ఆర్థర్. కానీ వారికి తాను ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. పోలింగ్ కి ముందు కూడా తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని, కానీ వారి ఆటలు సాగవని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చానన్నారు ఆర్థర్.
200కోట్లకంటే జగనే నాకు ఎక్కువ..
200కోట్ల రూపాయలు ఓవైపు, జగన్ ఫొటో మరోవైపు పెడితే.. తాను జగన్ ఫొటోనే తీసుకుంటానని చెప్పారు ఎమ్మెల్యే ఆర్థర్. ఎమ్మెల్యే తనకు ఆఫర్ వచ్చిందన్నారు కానీ, అసలు బేరం జరిగిందో లేదో చెప్పడంలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు తనకు వచ్చిన ఫోన్ కాల్స్ టీడీపీ నుంచే అని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కి, వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఎప్పటినుంచో రాజకీయ గొడవలున్నాయి. వచ్చేసారి ఆర్థర్ కి కూడా వైసీపీ టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థర్ కూడా తెరపైకి వచ్చి తనకు వచ్చిన ఆఫర్ గురించి చెప్పుకున్నారు. తనకు జగనే కావాలని, డబ్బులొద్దని అంటున్నారు. మరి జగనే కావాలంటున్న ఆర్థర్ కి వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందో లేదో చూడాలి.