Telugu Global
Andhra Pradesh

కొత్తవి ఇవ్వాలి కానీ, పెన్షన్లు తీసేస్తే ఎలా..? –వైసీపీ ఎమ్మెల్యే

పెన్షన్ల తొలగింపుపై రెండు రోజులుగా ఎమ్మెల్యేల ఆఫీస్ లను బాధితులు చుట్టుముడుతున్నారు. వారికి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.

కొత్తవి ఇవ్వాలి కానీ, పెన్షన్లు తీసేస్తే ఎలా..? –వైసీపీ ఎమ్మెల్యే
X

ఏపీలో పెన్షన్ల ఏరివేత రాజకీయ దుమారం రేపింది. ఈరోజు సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన స్పందన కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షలమంది బాధితులు తమ పెన్షన్లు తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా స్థానిక ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. ఇందుకేనా మీకు ఓటువేసింది అని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ పెంచకపోయినా పర్లేదు, తీసేయొద్దని వేడుకుంటున్నారు. 200 రూపాయలుగా ఉన్నప్పటినుంచి తమకు పెన్షన్ వస్తుందని, ఇప్పుడు హఠాత్తుగా తాము ధనవంతులమైపోయామా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెన్షన్ల విషయంలో కాస్త కటువుగా మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ప్రభుత్వ విధానాన్ని సమర్థించలేదు. ఒక్క పెన్షన్ కూడా తీసేయడానికి వీల్లేదంటున్నారు శ్రీధర్ రెడ్డి.

అర్హులందరికీ పెన్షన్లు ఉండాల్సిందే, అర్హులైన ఏ ఒక్కరికీ పెన్షన్ తీసేయడానికి వీల్లేదంటూ కొంతమంది నేతలు సర్దిచెబుతున్నారు. అంటే అనర్హులను ఏరిపారేయండి అనేది వారి పరోక్ష సూచన. కానీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాత్రం అర్హత పేరెత్తకుండానే ఏ ఒక్కరి పెన్షన్ పోయినా వారు బాధపడతారని, అలా పేదలను బాధపెట్టడం ప్రభుత్వానికి సరికాదని చెబుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 2700 మందికి నోటీసులిచ్చారని, వారిలో ఏ ఒక్కరికీ పెన్షన్ పోకుండా చూస్తానని మాటిచ్చారు.

కొత్తవి ఇవ్వాలి..

కొత్త పెన్షన్లు ఇస్తే పేదలు సంతోషిస్తారని, కానీ పాత పెన్షన్లు తీసేస్తే వారు బాధపడతారని, అలా ప్రజల్ని బాధపెట్టడం సరికాదంటున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. పెన్షన్ల తొలగింపుపై రెండు రోజులుగా ఎమ్మెల్యేల ఆఫీస్ లను బాధితులు చుట్టుముడుతున్నారు. వారికి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. అధికారులకు చెప్పి రీ సర్వే చేయిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే అర్హత నిబంధనలు కఠినంగా ఉండటంతో ఇంటి విస్తీర్ణం పెరిగినా, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇన్ కమ్ ట్యాక్స్ కట్టినా కూడా పెన్షన్లు తీసేస్తున్నారు. రీసర్వే చేపట్టినా వీటిలో మార్పు ఉండదు కాబట్టి ఎలాంటి ఫలితం ఉండదు. ప్రభుత్వం నిబంధనలు సడలిస్తేనే పెన్షన్ దారుల కష్టాలు తీరతాయి. మరి ఎమ్మెల్యేల అభ్యంతరాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

First Published:  26 Dec 2022 2:23 PM IST
Next Story