Telugu Global
Andhra Pradesh

ఏ చేశామని ఓట్లు అడుగుతాం..? ఆనం వ్యాఖ్యల కలకలం

ప్రజలు ప్రస్తుతం తనను కూడా నమ్మే పరిస్థితిలో లేరని, అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు ఆనం. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ చేశామని ఓట్లు అడుగుతాం..? ఆనం వ్యాఖ్యల కలకలం
X

వైసీపీ పాలనలో సంక్షేమ కార్యక్రమాలు విరివిగా అమలవుతున్నాయే కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మాత్రం అడుగులు పెద్దగా ముందుకు పడలేదు. గుంతల రోడ్లు బాగు చేయలేదు, కొత్త ప్రాజెక్ట్ లేవీ పూర్తి కాలేదు, ఫ్లైఓవర్లు, ఇతరత్రా కార్యక్రమాలలో పెద్దగా పురోగతి లేదు. అప్పటికే 90 శాతం పూర్తయిన నెల్లూరు పెన్నా బ్యారేజ్, సంగం బ్యారేజ్ లను పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారే కానీ, వైసీపీ హయాంలో మొదలై, పూర్తయిన ప్రాజెక్ట్ లు చాలా తక్కువ. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు చెబితే ఆరోపణలంటారు, సొంత పార్టీ నేతలే కుండబద్ధలు కొడితే స్వపక్షంలోనే విపక్షం అంటారు. సరిగ్గా ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి అదే చేశారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పనులు జరగడంలేదని తేల్చేశారు. ఇలా అయితే మరోసారి ప్రజల్ని ఎలా ఓట్లు అడుగుతామన్నారు.

గ్రామాలు, మున్సిపాల్టీల్లో ప్రతి సచివాలయానికి వైసీపీ నుంచి ముగ్గురు కన్వీనర్లను నియమించారు. ఈ కన్వీనర్ల సమావేశానికి హాజరైన క్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐ ప్యాక్ నుంచి వచ్చిన పరిశీలకుడి సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఐప్యాక్ సభ్యులు ఏడాది కష్టపడాలని సూచిస్తున్నారని, ఏడాది కష్టపడినా ప్రజలు ఏ నమ్మకంతో ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. కండలేరు ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నా రాపూరులో ఒక్క చెరువులో కూడా నీళ్లు నింపలేకపోయామన్నారు ఆనం. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్‌ఆర్‌ కలను నెరవేర్చలేకపోయామని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామన్నారు. ప్రజలు ప్రస్తుతం తనను కూడా నమ్మే పరిస్థితిలో లేరని, అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాజెక్ట్ లు కట్టలేదు, రోడ్లు వేయలేదు..

గతంలో వెంకటగిరి ప్రాంతంలో ఎస్ఎస్ కెనాల్ ప్రారంభోత్సవం కోసం వైసీపీకి ఓటు వేయాలని అడిగామని, కానీ అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా దానిపై పురోగతి లేదన్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చామని, ఇప్పుడు జగనన్న కాలనీలు అంటున్నా.. పనులు మాత్రం జరగడంలేదన్నారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల్లో కూడా ఆనం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరగడంలేదని, కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదన్నారు. ఇప్పుడు బహిరంగ వేదికపై వాలంటీర్లు, కన్వీనర్ల సమక్షంలో మరోసారి సమస్యలు ఏకరువు పెట్టారు. కేవలం పెన్షన్లు ఇస్తేనే ఓట్లు పడతాయనుకోవడం భ్రమ అన్నారు ఆనం. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆనం వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేతలు వైసీపీకి కౌంటర్లు ఇస్తున్నారు.

First Published:  28 Dec 2022 12:20 PM GMT
Next Story