ఫిబ్రవరిలో మేనిఫెస్టో, 2 నెలలు బస్సు యాత్ర.. జగన్ కీలక ప్రకటనలు
ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని, మార్చినాటికి ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం జగన్. ఎన్నికలకు సన్నద్ధం కావడటమంటే, పార్టీ శ్రేణులంతా గ్రామస్థాయి నుంచి ప్రజలతో మమేకమవ్వాలన్నారు.
సీఎం జగన్ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. ఇన్నాళ్లూ ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అంటున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కీలక ప్రకటనలు చేశారు. బస్సు యాత్రకు సిద్ధం కావాలంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే ఈ యాత్రలో జగన్ పాల్గొనరు. బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలుంటారు. అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31వరకు దాదాపు 2నెలలపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని చెప్పారు సీఎం జగన్. ప్రతి రోజూ మూడు మీటింగ్ లు జరుగుతాయని, ప్రభుత్వం చేసిన మంచి, సామాజిక న్యాయం, సాధికారత గురించి ప్రజలకు వివరించి చెప్పాలని నేతలకు సూచించారు జగన్.
జనవరి 1నుంచి పింఛన్ల పెంపు..
అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ 3వేల రూపాయలు చేస్తామని మాటిచ్చిన జగన్.. పెంచుకుంటూ పోతున్నారు. జనవరి-1నుంచి రూ.3వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. జనవరి 10నుంచి వైఎస్సార్ చేయూత మొదలవుతుందన్నారు. జనవరి 20 నుంచి 30 దాకా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా లబ్ధిదారులకు నిధుల బదిలీ జరుగుతుందన్నారు జగన్. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నవంబర్-1 నుంచి మొదలై డిసెంబర్ 10వరకు కొనసాగుతుందని చెప్పారు. ఏపీ ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్ రావాలనే విధంగా ప్రచారం చేయాలని అన్నారు.
మార్చికల్లా ఎన్నికలకు సన్నద్ధం..
ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని, మార్చి నాటికి ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం జగన్. ఎన్నికలకు సన్నద్ధం కావడటమంటే, పార్టీ శ్రేణులంతా గ్రామ స్థాయి నుంచి ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ప్రజలతోనే మన పొత్తు అని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు సంక్షేమాన్ని అందించామని, వారంతా వైసీపీకి ఓటు వేసేలా చూడాలన్నారు. రాబోయే కాలంలో పేదవాడికి పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతోందని. పేదవారంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు సీఎం జగన్.
♦