వైసీపీ విస్తృత స్థాయి సమావేశం.. జగన్ ప్రసంగంపైనే ఆసక్తి
దాదాపు 8వేలమంది ప్రతినిధులు పాల్గొంటారని అంచనా. అందరికీ ముందుగా పాస్ లు జారీ చేశారు. పాస్ లు లేనివారికి నో ఎంట్రీ.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతల కోసం ఏర్పాటు చేసిన తొలి విస్తృత స్థాయి సమావేశం ఇది. ఇన్నాళ్లూ బహిరంగ సభల్లోనే జగన్ పార్టీ నేతలకు కనిపించేవారు. గడప గడప సమీక్షల్లో కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ చార్జ్ లకు మాత్రమే ఆ అవకాశం దక్కేది. ఇప్పుడు 8వేల మందితో ఆయన బహిరంగ వేదికగా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటున్నారు. 2024 ఎన్నికలకోసం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయబోతున్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇన్ చార్జ్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలతో సహా.. దాదాపు 8వేలమంది ప్రతినిధులు పాల్గొంటారని అంచనా. అందరికీ ముందుగా పాస్ లు జారీ చేశారు. పాస్ లు లేనివారికి నో ఎంట్రీ. ఉదయం 8.30 గంటలకు లోపలికి వస్తే.. సాయంత్రం వరకు బయటకు వెళ్లే అవకాశం లేదు.
వై ఏపీ నీడ్స్ జగన్..?
ఎన్నికల ఏడాదిలో వై ఏపీ నీడ్స్ జగన్.. అంటూ కొత్త కార్యక్రమం మొదలవబోతోంది. ఇప్పటికే గడప గడపకు మంచి స్పందన వచ్చిందని జగన్ నమ్ముతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ అనే రెండు కార్యక్రమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. స్టిక్కర్ల కార్యక్రమాలు అంతగా ఫలితాన్నివ్వలేదు. జగనన్న సురక్ష, ఆరోగ్య సురక్షతో కొంత ప్రయోజనం కనపడుతోంది. ఇక ఫైనల్ గా వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ కొత్త కార్యక్రమం మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలా చేపట్టాలి, ఏం చేయాలి.. 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీయే ఎలా గెలవాలి..? అనే విషయాలపై నేతలకు ఈరోజు సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనపడుతోంది. తమపై సింపతీ పెరిగిందని టీడీపీ అనుకుంటుంది కానీ.. సామాన్య ప్రజలు ఆ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే సమయంలో టీడీపీ-జనసేన కూటమిని జనం స్వాగతిస్తారా లేదా అనేది కూడా డౌటే. ఈ దశలో వైసీపీ పట్టు బిగిస్తోంది. మరింత గట్టిగా ఎన్నికలకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వై ఏపీ నీడ్స్ జగన్ కూడా ఇలాంటి కార్యక్రమమే. ఈరోజు సీఎం జగన్, కార్యకర్తలకు ఎలాంటి ఉపదేశం ఇస్తారు..? కొత్త విషయాలేవైనా చెబుతారా..? లేదా..? అనేది వేచి చూడాలి.