ఉండవల్లి కాదు ఊసరవెల్లి.. శ్రీదేవిని దారుణంగా టార్గెట్ చేసిన నేతలు
సినీనటి శ్రీదేవికి మించి నటించిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు కూతురిని తీసుకెళ్లి జగన్ వద్ద ఫొటో దిగిందని, ఆయన అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని మండిపడ్డారు అమర్నాథ్.
నా గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని అసెంబ్లీలో ఆమె అన్నప్పుడు అందరూ బల్లలు చరిచారు. జగన్ వీరుడు, శూరుడు అని బహిరంగ సభల్లో చెప్పినప్పుడు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు వాళ్లే ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. ఆమె ఉండవల్లి శ్రీదేవి కాదని ఊసరవెల్లి అని సెటైర్లు పేల్చారు.
సినీ నటి శ్రీదేవికి మించిన నటి..
వైసీపీలో ఉన్నప్పుడు ఉండవల్లి శ్రీదేవికి నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆమె ఉండవల్లి శ్రీదేవి కాదు ఊసరవెల్లి శ్రీదేవి అని వ్యంగాస్త్రాలు సంధించారు. సినీనటి శ్రీదేవికి మించి నటించిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు కూతురిని తీసుకెళ్లి జగన్ వద్ద ఫొటో దిగిందని, ఆయన అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని మండిపడ్డారు అమర్నాథ్. ఆమె మరి కొద్ది రోజుల్లోనే జనంతో చీకొట్టించుకునే స్థితికి చేరుకుంటుందని, శ్రీదేవి లాంటి నమ్మకద్రోహుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు అమర్నాథ్.
పార్టీ లైన్ దాటితే దళితులైనా ఎవరైనా ఒకటే..
దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని ఎద్దేవా చేశారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే శ్రీదేవి మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏనాడైనా ఎస్సీలకు పదవులిచ్చారా అని ప్రశ్నించారు. దళితులు రాజకీయంగా ఎదగడానికి సీఎం జగన్ అవకాశాలు కల్పిస్తున్నారని .. అదే క్రమంలో పార్టీ లైన్ దాటితే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయన్నారు. జగన్ ను మోసం చేసినోళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలిపారు సురేష్.