Telugu Global
Andhra Pradesh

పోస్టల్ బ్యాలెట్.. ఆ నిబంధనపై వైసీపీ అభ్యంతరం

దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు పేర్ని నాని. ఏపీ సీఈఓ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందన్నారు.

పోస్టల్ బ్యాలెట్.. ఆ నిబంధనపై వైసీపీ అభ్యంతరం
X

పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ అధికారి స్టాంప్ లేకపోయినా అవి చెల్లుబాటు అవుతాయంటూ ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. గతంలో ఉన్న నిబంధన సడలించడాన్ని తప్పుబడుతున్నారు వైసీపీ నేతలు. ఇతర రాష్ట్రాల్లో లేని నిబంధన ఏపీలో ఎందుకని నిలదీస్తున్నారు. అడిషనల్ సీఈఓని కలసి తమ ఫిర్యాదు కాపీ అందించారు. వైసీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ఏసీఈవోని కలసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.


అన్ని రాష్ట్రాలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై గతంలోనే నిబంధనలు పంపారని, పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు వివరించారని అన్నారు పేర్ని నాని. గెజిటెడ్‌ అధికారి సంతకం పెట్టి స్టాంప్‌ వేయాలని గతంలో చెప్పారని, ఒకవేళ స్టాంప్‌ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని కూడా అన్నారని, ఏపీలో మాత్రం ఇప్పుడీ నిబంధన సడలించడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. ఏపీ సీఈఓ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదని, ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే అది ఘర్షణలకు దారి తీస్తుందని అన్నారు. ఈ నిబంధనల పై పునరాలోచించాలని తాము రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిని కోరినట్టు చెప్పారు నాని.

పోలింగ్ రోజు టీడీపీ అక్రమాలకు పాల్పడిందని, లెక్కింపు ప్రక్రియ కూడా సజావుగా సాగేందుకు అవకాశం లేదని అన్నారు మేరుగ నాగార్జున. ఎన్నికల్లో టీడీపీ అలజడులు సృష్టించి దాడులు చేస్తే, ఈసీ చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీ కోసం ఈసీ నిబంధనలు కూడా మార్చేసిందని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమాలకు విరుద్ధంగా, రాష్ట్ర అధికారులు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు మేరుగ. పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు.

First Published:  28 May 2024 5:08 PM IST
Next Story