Telugu Global
Andhra Pradesh

జగన్ నివాసంలో కీలక సమావేశం.. ఎవరెవరు వచ్చారంటే..?

జగన్ పరిమితంగానే పిలిచారా, లేక అందుబాటులో ఉన్నవారే వచ్చారా.. అనే విషయం తెలియదు కానీ అతికొద్దిమంది నేతలు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు.

జగన్ నివాసంలో కీలక సమావేశం.. ఎవరెవరు వచ్చారంటే..?
X

వైసీపీ ఓటమి తర్వాత అతి కొద్దిమంది నేతలు మాత్రమే మీడియా ముందుకొచ్చారు, ధైర్యంగా మాట్లాడారు. ఓటమిని కొందరు స్వాగతిస్తే, మరికొందరు నెపం ఈవీఎంలపైకి నెట్టేశారు. సాక్షాత్తూ జగన్ కూడా ఓటమి తనకు ఆశ్చర్యం కలిగించిందని, సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా వేసిన ఓట్లు ఏమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు ఓటమికి అసలు కారణాలు వెదకడం మొదలు పెట్టారు నేతలు. ఈ క్రమంలో జగన్ ఇంట్లో తొలి మీటింగ్ మొదలైంది.


వైసీపీ ఓటమిపై పోస్ట్ మార్టమ్ మొదలైంది. ఓటమికి కారణాలు ఏంటి..? ప్రజల్ని మనం తప్పుగా అంచనా వేశామా..? తక్కువ అంచనా వేశామా..? అనే అంతర్మథనం నేతల్లో మొదలైంది. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు ఓట్లు పడలేదని నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ దశలో జగన్ నివాసంలో ప్రారంభమైన తొలి మీటింగ్ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలినాని, గురుమూర్తి, శివప్రసాద్ రెడ్డి, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఓటమి కారణాలను అంచనా వేస్తున్నారు.

మిగతావారు ఎక్కడ..?

జగన్ పరిమితంగానే పిలిచారా, లేక అందుబాటులో ఉన్నవారే వచ్చారా.. అనే విషయం తెలియదు కానీ అతికొద్దిమంది నేతలు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. మిగతా నేతలు ఈ మీటింగ్ కి ఎందుకు రాలేదు..? ముందుగానే సమాచారం ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. జగన్ చుట్టూ ఉన్న కోటరీ, కొంతమంది అధికారులు.. ఆయన్ను తప్పుదోవ పట్టించారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన ఆరోపణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుందా..? చర్చ పూర్తయిన తర్వాత మీడియాతో ఎవరైనా మాట్లాడతారా..? అనేది తేలాల్సి ఉంది.

First Published:  6 Jun 2024 8:03 AM GMT
Next Story