Telugu Global
Andhra Pradesh

వైసీపీ లాజిక్.. ఇరుకున పడ్డ చంద్రబాబు

చంద్రబాబుకి కూడా అలాంటి ధైర్యం ఉంటే 2014 మేనిఫెస్టో బయటకు తీయాలి. ఆ మేనిఫెస్టో చూపించి అధికారంలోకి వచ్చిన తాను ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాటిలో ఎన్ని హామీలు, ఎంతమేరకు అమలు చేశారో చెప్పాలి.

వైసీపీ లాజిక్.. ఇరుకున పడ్డ చంద్రబాబు
X

మా మేనిఫెస్టో చూడండి, మా పథకాలు చూడండి.. కూటమికే ఓటు వేయండి అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి లాజిక్ తో ఫుల్ స్టాప్ పెట్టారు వైసీపీ నేతలు. చంద్రబాబు నోరెత్తకుండా చేశారు. 2024 మేనిఫెస్టో గురించి మాట్లాడాలంటే, ముందు 2014లో అమలు చేసిన వాటి గురించి చెప్పాలంటున్నారు. ఒకవేళ ఆ చర్చ మొదలైతే బాబు బూటకపు హామీలన్నీ వారి నోటివెంటే బయటకు రావాల్సిన పరిస్థితి. అదే జరిగితే ఆయన్ను ఇంకెవరూ నమ్మరు. అందుకే ఆ ప్రస్తావనే తేకుండా తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు బాబు అండ్ కో..

2019లో తాను అమలు చేసిన హామీల గురించి చెప్పి, ఆ మేనిఫెస్టో చూపించి.. ఆ తర్వాతే 2024 మేనిఫెస్టోని ప్రకటించానని ధైర్యంగా చెబుతున్నారు సీఎం జగన్. చంద్రబాబుకి కూడా అలాంటి ధైర్యం ఉంటే 2014 మేనిఫెస్టో బయటకు తీయాలి. ఆ మేనిఫెస్టో చూపించి అధికారంలోకి వచ్చిన తాను ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాటిలో ఎన్ని హామీలు, ఎంతమేరకు అమలు చేశారో చెప్పాలి. కానీ బాబు ఆ పని మాత్రం చేయడంలేదు. అయితే వైసీపీ నేతలు వదిలిపెట్టడం లేదు. మేనిఫెస్టో గురించి మాట్లాడాలంటే ముందుగా 2014 హామీల గురించి చర్చ పెట్టాలని టీడీపీ నేతల్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే సీఎం జగన్ కూడా తన ప్రచారంలో చంద్రబాబు 2014 మేనిఫెస్టోని పదే పదే గుర్తు చేస్తున్నారు. ఆయన అసత్యపు హామీలపై కౌంటర్లిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇదే విషయంలో చంద్రబాబుకి సవాల్ విసిరారు. చంద్రబాబుకి దమ్ముంటే 2014 మేనిఫెస్టోలో ఏమేం అమలయ్యాయో చెప్పాలన్నారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పిన చంద్రబాబు, వాటిని ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామ­ని, ఎన్డీయేలో కలిశా­మ­ని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వే­జోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు పేర్ని నాని.

ఏపీ­లో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న రాష్ట్ర ఆదాయాన్ని బట్టి సీఎం జగన్‌ మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు పేర్ని నాని. కేవలం పథకాలకోసమే ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డ­బ్బులు ఎక్కడి నుంచి తె­స్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వి­వ­రించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ లాజిక్ తో టీడీపీ పూర్తిగా ఇరుకునపడిపోయింది. 2014లో ఇచ్చిన హామీలు మరోసారి ప్రజలకు గుర్తు చేసి ఇరుకునపడటం ఎందుకని సైలెంట్ గా ఉండిపోయింది.

First Published:  2 May 2024 7:37 AM IST
Next Story