Telugu Global
Andhra Pradesh

పరామర్శలు మొదలు.. జనంలోకి వైసీపీ నేతలు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడిలో వైసీపీ కార్యకర్త, అతని భార్య.. వైరి వర్గం దాడుల్లో గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ దంపతులను మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కిట్టు పరామర్శించారు.

పరామర్శలు మొదలు.. జనంలోకి వైసీపీ నేతలు
X

ఎన్నికల ఫలితాల తర్వాత మెల్ల మెల్లగా వైసీపీలో కదలిక మొదలైంది. నిన్న మొన్నటి వరకు జనంలోకి ఎలా వెళ్లాలా అని ఆలోచించారు నేతలు. ప్రస్తుతం కూటమి హనీమూన్ పీరియడ్ జరుగుతోందని, కొన్నాళ్లు వేచి చూద్దామని కూడా అనుకున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఆయన కార్యకలాపాల్లో ఎక్కడా విశ్రాంతి లేదు. తాడేపల్లిలో ఉంటే నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నెల్లూరు పర్యటనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించి వచ్చారు, కడప ఆస్పత్రిలో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చాారు. ఇటు వైసీపీ నేతలు కూడా జనంలోకి వస్తున్నారు. పరామర్శలు మొదలు పెట్టారు.

కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. బాధితులకు మద్దతుగా నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు, సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు మాత్రమే నేరుగా వారిని కలసి ధైర్యం చెబుతున్నారు. ఇటీవల కీలక నేతలంతా తమ ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలను కలుస్తున్నారు. దాడులకు గురైన వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పరామర్శల పర్వం మొదలైంది. అటు తెనాలిలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు దాడుల్లో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించి, రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడిలో వైసీపీ కార్యకర్త, అతని భార్య.. వైరి వర్గం దాడుల్లో గాయపడ్డారు. వారి ఇంట్లో సామగ్రి కూడా ధ్వంసమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ దంపతులను మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కిట్టు పరామర్శించారు. పార్టీ అధినేత జగన్ పంపించిన రూ.50వేల చెక్ ని వారికి అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసంలో కూడా బాధితులకు వైసీపీ రూ.50వేల ఆర్థిక సాయం చేసింది.

First Published:  7 July 2024 8:55 AM IST
Next Story