Telugu Global
Andhra Pradesh

టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారు.. సిట్ కి వైసీపీ ఫిర్యాదు

అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో ఎస్పీలని పురందేశ్వరి ఫిర్యాదు ఆధారంగా మార్చారని, అక్కడే ఇప్పుడు హింస జరిగిందని, సస్పెన్షన్లు కూడా జరిగాయని అన్నారు వైసీపీ నేతలు.

టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారు.. సిట్ కి వైసీపీ ఫిర్యాదు
X

ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై వైసీపీ నేతలు సిట్ కి ఫిర్యాదు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ని కలసిన వైసీపీ నేతలు టీడీపీ నేతలతో కొందరు పోలీస్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. హింసాత్మక ఘటనలతో కొందరు ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. ఎన్నికల సమయంలో బదిలీలు జరగడం సహజమే అయినా, ఏపీలో మాత్రం పురందరేశ్వరి లేఖల ఆధారంగా రాజకీయ బదిలీలు జరిగాయని, అలా బదిలీలు జరిగిన చోటే ఇప్పుడు అల్లర్లు జరిగాయని అన్నారు వైసీపీ నేతలు. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్,పేర్ని నాని సహా మరికొందరు నేతలు సిట్ టీమ్ ని కలిసి ఫిర్యాదు చేశారు.


అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో ఎస్పీలని పురందేశ్వరి ఫిర్యాదు ఆధారంగా మార్చారని, అక్కడే ఇప్పుడు హింస జరిగిందని, సస్పెన్షన్లు కూడా జరిగాయని అన్నారు వైసీపీ నేతలు. ఇద్దరు ఐపీఎస్ లని సస్పెండ్ చేశారంటే పోలీసుల పాత్ర ఎంత ఉందో అర్థం అవుతుందని, పోలీస్ శాఖ టీడీపీతో పూర్తిగా కుమ్మక్కయిందని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్ధితి అని అన్నారు. ఎన్నికల సమయంలో తాము ఫిర్యాదులు చేసినా కనీసం వాటిని తీసుకోలేదని, తమపైనే తప్పుడు సెక్షన్లు పెట్టి తప్పుడు కేసులు నమోదు చేయాలని చూస్తున్నారని చెప్పారు. పోలీసుల కాల్ డేటా కూడా పరిశీలించాలని సిట్ టీమ్ ని కోరారు వైసీపీ నేతలు.

సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ సమర్ధ అధికారి అని తాము నమ్ముతున్నామని, అందుకే ఆయన్ను కలసి ఫిర్యాదు చేశామని చెప్పారు వైసీపీ నేతలు. మంత్రి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, టీడీపీ జెండాలు ఎగురవేయడం మరీ దుర్మార్గం అన్నారు. ఇలాంటి పనులు చేయాలనే అధికారుల్ని మార్చారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ప్రజాస్వామ్యానికే ఈ ఎన్నికలు ఓ మచ్చలా మిగిలాయన్నారు. పూర్తి స్ధాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ని కోరారు వైసీపీ నేతలు.

First Published:  20 May 2024 3:16 PM GMT
Next Story