Telugu Global
Andhra Pradesh

వైసీపీలో చేరికల హుషారు.. ఒకేరోజు 8 నియోజకవర్గాల నేతలు

సీఎం జగన్ నేటి నుంచి బస్సుయాత్రకు సిద్ధమవుతున్న వేళ... నిన్న క్యాంప్ ఆఫీస్ కళకళలాడింది. చేరికలతో సందడి నెలకొంది.

వైసీపీలో చేరికల హుషారు.. ఒకేరోజు 8 నియోజకవర్గాల నేతలు
X

అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనా, వైసీపీలో తమకు టికెట్ లేదని తెలిసినా కూడా ఆ పార్టీలోకి చేరికలు జోరందుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా వైసీపీలోకి క్యూ కట్టారు. నిన్న మంగళవారం ఒకేరోజు 8 నియోజకవర్గాల నేతలు సీఎం జగన్ ని కలిశారు. క్యాంప్ ఆఫీస్ లో వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. వైసీపీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ఘంటాపథంగా చెబుతున్నారు నాయకులు. విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, పాయకరావుపేట, నూజివీడు, రాజంపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట నేతలు వైసీపీలో చేరారు.


విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు కూడా సీఎం జగన్ ని కలసి వైసీపీలో చేరారు. విశాఖపట్నంకు చెందిన టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు వైసీపీలో చేరారు. రాజంపేట టీడీపీ లోక్ సభ ఇన్ చార్జ్ గంటా హరి కూడా టీడీపీలో చేరారు. సూళ్ళూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి, వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ బీసీ నేత మస్తాన్ యాదవ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ ఇన్ ఛార్జ్‌ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌ కూడా వైసీపీలో చేరారు. పాయకరావు పేటకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారికి సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య కూడా వైసీపీలో చేరారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్య దొర కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.


సీఎం జగన్ నేటి నుంచి బస్సుయాత్రకు సిద్ధమవుతున్న వేళ... నిన్న క్యాంప్ ఆఫీస్ కళకళలాడింది. చేరికలతో సందడి నెలకొంది. పార్టీలోకి రావాలనుకుంటున్న వారికి వైసీపీ స్థానిక నేతలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. వారంతా తమకు అదనపు బలం అని భావిస్తున్నారు.

First Published:  27 March 2024 8:13 AM IST
Next Story