మళ్లీ గన్నవరం లొల్లి.. బంతి జగన్ కోర్టులో వేసిన యార్లగడ్డ
అమెరికా నుంచి తనను తీసుకు వచ్చింది జగన్ అని, అలాంటి నాయకుడు తనను క్రాస్ రోడ్స్ లో నిలబెడతారని అనుకోవడం లేదన్నారు యార్లగడ్డ. వైసీపీ అధిష్టానం తనకు అన్యాయం చేయబోదన్నారు.
ఏపీలో గన్నవరం నియోజకవర్గం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ టికెట్ పై పోటీ చేస్తానంటున్నారు. దాదాపుగా జగన్ కూడా వంశీవైపే మొగ్గుచూపుతున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు మాత్రం తగ్గేది లేదంటున్నారు. గన్నవరం సీటు తనదేనని తనకు జగన్ అన్యాయం చేయబోరని, ఆ నమ్మకం ఉందని చెబుతున్నారు యార్లగడ్డ.
నేను వైసీపీలోనే..
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు యార్లగడ్డ వెంకట్రావు. తాను వైసీపీలోనే ఉన్నానని, వైసీపీ నుంచే సీటు ఇస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. అమెరికా నుంచి తనను తీసుకు వచ్చింది జగన్ అని, అలాంటి నాయకుడు తనను క్రాస్ రోడ్స్ లో నిలబెడతారని అనుకోవడం లేదన్నారు యార్లగడ్డ. వైసీపీ అధిష్టానం తనకు అన్యాయం చేయబోదన్నారు. గన్నవరం ఖాయమైందని ఎవరి పేరు ఇంకా బయటకు రాలేదు కదా అని చెప్పారు యార్లగడ్డ.
2019లో పెనమలూరు సీటు ఇస్తానని జగన్ తనకు చెప్పారని, అందుకే తాను అమెరికానుంచి ఇండియాకు వచ్చానంటున్నారు యార్లగడ్డ. అయితే పెనమలూరు కుదరకపోవడంతో 2019లో గన్నవరం నుంచి పోటీ చేయాలని ఆదేశించారని.. తాను కూడా జగన్ ఆదేశాన్ని పాటించానన్నారు. రిగ్గింగ్, దొంగ ఇళ్ళ పట్టాల కారణంగా తాను ఓటమి పాలయ్యానని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో వైసీపీని పటిష్టం చేసింది తానేనన్నారు. జగన్ తనకు గన్నవరం అనే పెద్ద కుటుంబాన్నిచ్చారని, ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
ఫైనల్ గా తనకు జగన్ అన్యాయం చేయబోరని అంటున్న యార్లగడ్డ వెంకట్రావు, పరోక్షంగా వల్లభనేని వంశీ వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. గతంలో ఇక్కడ వంశీ సహా మూడు వర్గాలు ఉండగా, సీఎం జగన్ సయోధ్య కుదర్చాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. యార్లగడ్డ మాత్రం తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు.