Telugu Global
Andhra Pradesh

డిప్యూటీ సీఎం వర్సెస్ సలహాదారు.. వైసీపీలో మరో రగడ

చాలా చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులతో ఎమ్మెల్యేలు, ఎంపీలకు గొడవ ఉంది. తమతోపాటు ఉండేవారే తమకి ఎసరు పెడుతున్నారని భావిస్తున్న సిట్టింగ్ లు తమ సీటు కాపాడుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం వర్సెస్ సలహాదారు.. వైసీపీలో మరో రగడ
X

ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పోటీ కంటే.. వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా హైలెట్ అవుతోంది. ఇప్పటికే వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఓ ఎంపీని దూరం పెట్టింది. చాలా చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులతో ఎమ్మెల్యేలు, ఎంపీలకు గొడవ ఉంది. తమతోపాటు ఉండేవారే తమకి ఎసరు పెడుతున్నారని భావిస్తున్న సిట్టింగ్ లు తమ సీటు కాపాడుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ డీప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి గంగాధర నెల్లూరులో నారాయణ స్వామి వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు.

మాజీ ఎంపీకి ఇప్పుడు వైసీపీలో పట్టు ఉంటుందా అనుకోవచ్చు. జ్ఞానేంద్ర రెడ్డి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు. సీఎం జగన్ దగ్గర ఆయనకు పలుకుబడి ఉంది. అలాంటి వ్యక్తి నారాయణ స్వామిని టార్గెట్ చేశారంటే రేపు ఆయన టికెట్ కి ఎసరు పెట్టినట్టే కదా. అందుకే ఆయన టెన్షన్ పడిపోతున్నారు. గత ఎన్నికల్లో నారాయణస్వామిని గెలిపించడానికి అందరం కలసి పనిచేశామని, కానీ ఆయన అందర్నీ కలుపుకొని పోవట్లేదని ఆరోపిస్తున్నారు జ్ఞానేంద్ర రెడ్డి. 2024 ఎన్నికల్లో నారాయణ స్వామికి టికెట్ కేటాయిస్తే మద్దతు ఇవ్వాలా ? వద్దా ? అనే విషయాన్ని ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని అంటున్నారు జ్ఞానేంద్ర రెడ్డి.

నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ కావడంతో.. అక్కడ జ్ఞానేంద్ర రెడ్డికి పోటీ చేసే అవకాశం లేదు. కానీ ఆయన మరో వర్గాన్ని అక్కడ ప్రోత్సహిస్తున్నారు. నారాయణ స్వామికి టికెట్ రాకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా నారాయణ స్వామి టెన్షన్ పడుతున్నారు. దళితుడిని కావడం వల్లే తనని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు నారాయణ స్వామి. తాను ఏ తప్పు చేయలేదని, తప్పుచేస్తే కాళ్లమీద పడి క్షమాపణ అడిగే మనస్తత్వం తనది అంటున్నారు నారాయణ స్వామి. తాను జ్ఞానేంద్రరెడ్డిలాగా పార్టీలు మారలేదని కౌంటర్ ఇచ్చారు. అమెరికా, బెంగళూరులో వ్యాపారాలు చేస్తూ టైంపాస్ పాలిటిక్స్ చేయట్లేదని సెటైర్లు వేశారు.

ప్రస్తుతం జీడీ నెల్లూరులో నారాయణ స్వామి వర్సెస్ జ్ఞానేంద్ర రెడ్డి వర్గపోరు ఆసక్తికరంగా మారింది. చివరకు ఇది పార్టీకి చేటు తెస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరోసారి టికెట్ కోసం నారాయణ స్వామి, ఆయనకు పార్టీ టికెట్ లేకుండా చేయాలని జ్ఞానేంద్ర రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి జగన్ ఈ గొడవను సామరస్యంగా పరిష్కరిస్తారో లేదో చూడాలి.

First Published:  13 April 2023 11:05 AM IST
Next Story