పంతం నెగ్గించుకున్న బాలినేని.. పనిచేయని జగన్ మంత్రం
సుదీర్ఘ చర్చలు జరిగినా.. అటు పార్టీ కానీ, ఇటు బాలినేని కానీ మీడియా ముందుకు రాలేదు. కోఆర్డినేటర్ గా బాలినేనిని కొనసాగించే విషయంలో జగన్ మంత్రం పనిచేయలేదనే చెప్పాలి. బాలినేని పంతం నెగ్గించుకున్నారనే ఒప్పుకోవాలి.
వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. ఇప్పుడు సీఎం జగన్ ఆయన్ను పిలిపించి మాట్లాడారు. చర్చల తర్వాత తేలిందేంటంటే.. బాలినేని రాజీనామాను దాదాపుగా జగన్ ఆమోదించినట్టే. ప్రస్తుతానికి తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతానని జగన్ కి బాలినేని తేల్చి చెప్పారు. అనారోగ్యాన్ని కారణంగా చూపించారు కానీ, తనకి కోఆర్డినేటర్ పదవి వద్దని తెగేసి చెప్పారు, పంతం నెగ్గించుకున్నారు.
జగన్ బుజ్జగించినా..
వైసీపీలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు నామమాత్రంగా మిగిలాయి. పెత్తనం అంతా రీజనల్ కోఆర్డినేటర్లదే, వారిపై సజ్జల ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు, సమస్య అంతకంటే పెద్దదైతేనే సీఎం జగన్ వెరకు వెళ్తుంది. అంత ప్రాముఖ్యత కలిగిన రీజనల్ కోఆర్డినేటర్ పదవిని కూడా బాలినేని వద్దనుకున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ బుజ్జగింపులు కూడా ఫలించలేదు. గతంలో మార్కాపురం సభ వ్యవహారంలో బాలినేనితో ల్యాప్ టాప్ బటన్ ఒత్తించి సర్దిచెప్పినా, ఇప్పుడు మాత్రం ఆయన తగ్గేది లేదన్నారు. తనకి ఏ పదవీ వద్దన్నారు, చివరకు అనుకున్నది సాధించారు.
మంత్రి పదవి కోల్పోయినప్పటినుంచి బాలినేని పార్టీపై అలకతోనే ఉన్నారు. అదే సమయంలో జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ కి మంత్రి పదవి కొనసాగించడం కూడా ఆయనకు ఇష్టం లేదు. అప్పట్లో సజ్జల రాయబారంతో ఆయన కాస్త చల్లబడినా, ఇటీవల మార్కాపురం సభ సందర్భంలో హెలిప్యాడ్ వరకు బాలినేని వాహనం వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఇగో బాగా హర్ట్ అయింది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఒకట్రెండు ప్రెస్ మీట్లకు హాజరైనా మాట్లాడకుండానే వెళ్లిపోయారు బాలినేని. తీరా ఇప్పుడు పార్టీ కోఆర్డినేటర్ పదవికి కూడా గుడ్ బై చెప్పేశారు. తాను కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతానని తేల్చి చెప్పారు. జగన్ కూడా బాలినేని చెప్పిన మాటకే తలూపాల్సి వచ్చింది. అందుకే సుదీర్ఘ చర్చలు జరిగినా.. అటు పార్టీ కానీ, ఇటు బాలినేని కానీ మీడియా ముందుకు రాలేదు. కోఆర్డినేటర్ గా బాలినేనిని కొనసాగించే విషయంలో జగన్ మంత్రం పనిచేయలేదనే చెప్పాలి. బాలినేని పంతం నెగ్గించుకున్నారనే ఒప్పుకోవాలి.