మళ్లీ మార్పులు మొదలు.. మైలవరం పరిశీలకుడిని పక్కనపెట్టిన వైసీపీ
గెలుపుకోసం చివరి నిమిషంలో కూడా మార్పులు జరిగే అవకాశాలుంటాయని... పరిశీలకులు, అభ్యర్థులెవరూ ఎన్నికలను లైట్ తీసుకోవద్దనే సందేశం పంపించారు జగన్.
అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల్ని వైసీపీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులను పార్టీ ఇన్ చార్జ్ లుగా ప్రకటిస్తూ, అవే స్థానాలకు పరిశీలకులను కూడా నియమించారు సీఎం జగన్. అంటే ఇన్ చార్జ్ పార్టీ టికెట్ పై పోటీ చేస్తారు, పరిశీలకుడు వారి గెలుపు కోసం కృషి చేస్తారు. అయితే అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులకు జగన్ ఏమాత్రం మొహమాట పడటంలేదు. ఆరోపణలు వచ్చినా, అభ్యంతరాలు తెరపైకొచ్చినా నిర్మొహమాటంగా వారిని మార్చేస్తున్నారు. పార్టీ గెలుపుకోసం రాజీపడేది లేదని అభ్యర్థులు, పరిశీలకులకు సందేశం పంపిస్తున్నారాయన. తాజాగా మైలవరం నియోజకవర్గ పరిశీలకుడికి ఇలాగే షాకిచ్చారు జగన్.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసైపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కి టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ టికెట్ పై అదే స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక వైసీపీ తరపున సర్నాల తిరుపతి రావు యాదవ్ ఇక్కడ బరిలో దిగుతున్నారు. ఈ నియోజకవర్గానికి పరిశీలకుడిగా వైసీపీ అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించింది. అయితే ఆయన అసలు అభ్యర్థిని డామినేట్ చేస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు అందింది. ఐప్యాక్ టీమ్ తో కూడా ఆ నియోజకవర్గంలో సమస్యలు మొదలయ్యాయట. దీంతో పంచాయితీ సీఎం జగన్ వద్దకు చేరింది. మైలవరం వైసీపీ పరిశీలకుడు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డిపై వేటు పడింది. ఆయన స్థానంలో కర్రా హర్షారెడ్డిని నియమించారు. అప్పిడి నియామకం జరిగి నెలరోజులే అవుతోంది. ఈలోగా ఆయన్ను మార్చడంతో స్థానికంగా కలకలం రేగింది.
వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నాయకులపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వారికి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నారు. అందుకై మైలవరంలో వసంతకు పోటీగా తిరుపతిరావు యాదవ్ ని రంగంలోకి దింపారు. పరిశీలకుడిని కూడా నియమించి పార్టీ గెలుపుకోసం సృషి చేయాలని ఆదేశించారు. కానీ ఆధిపత్యపోరు వల్ల అక్కడ వెంటనే పరిశీలకుడిని మార్చేశారు. గెలుపుకోసం చివరి నిమిషంలో కూడా మార్పులు జరిగే అవకాశాలుంటాయని... పరిశీలకులు, అభ్యర్థులెవరూ ఎన్నికలను లైట్ తీసుకోవద్దనే సందేశం పంపించారు జగన్.