నాయకుడంటే జగన్ లా ఉండాలి -సజ్జల
ప్రజాస్వామ్యంలో నిఖార్సయిన నాయకుడు జగన్ అని రుజువైందని చెప్పారు సజ్జల. విశ్వసించి అధికారం ఇచ్చిన ప్రజల కోసమే సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ప్రజాస్వామ్యంలో వైసీపీ ఓ రోల్ మోడల్ అన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, పోతుల సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ సంబరాలు జరుపుకున్నారు.
ఒక మహా వ్యక్తి నాయకుడయితే ఎలా ఉంటుందో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆచరణలో చేసి చూపించారన్నారు సజ్జల. సీఎం జగన్ కూడా తండ్రి బాటలో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నాయకులు ఎలా ఉండాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏమేం చెయ్యాలో జగన్ చేసి చూపిస్తున్నారని చెప్పారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు సజ్జల. వైసీపీ 12 ఏళ్ల ప్రస్థానానికి ఇది చాలన్నారు. ప్రజల అజెండానే సీఎం అజెండాగా పాలన సాగుతోందని అన్నారు.
నాయకుడే.. పాలకుడైతే..
— YSR Congress Party (@YSRCParty) March 12, 2023
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైయస్ జగన్ పాలన.
- సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు
#YSRCPForAll #YSRCPFormationDay pic.twitter.com/0hVLxOamWA
నిఖార్సయిన నాయకుడు..
ప్రజాస్వామ్యంలో నిఖార్సయిన నాయకుడు జగన్ అని రుజువైందని చెప్పారు సజ్జల. విశ్వసించి అధికారం ఇచ్చిన ప్రజల కోసమే సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుని పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాల మధ్య తాము రాజకీయాలు చేయడంలేదన్నారు సజ్జల. జగన్ ఆలోచనలు అమలు లోకి రావడం ఉద్యోగుల వల్లే సాధ్యమవుతోందని వివరించారు. ఉపాధ్యాయులు కూడా ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నారని అన్నారు. ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా బిల్లులన్నీ చెల్లిస్తున్నామని చెప్పారు. ఏ సమస్య వచ్చినా ప్రతిస్పందన కోసం తాము రెడీగా ఉన్నామన్నారు.