ఎంతో అభివృద్ధి చేశా, కానీ..! వైసీపీ మాజీ ఎంపీ ఆవేదన
వైసీపీ హయాంలో ప్రజలకు మంచే జరిగిందని, మరింత మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు వారికి ఓటు వేసి ఉంటారని వివరించారు మాజీ ఎంపీ భరత్.
వైసీపీ నేతల్లో కొంతమంది ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తమ హయాంలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని, అయినా ప్రజలు తమ పార్టీని ఎందుకు ఆదరించలేదో అర్థం కావడం లేదని అంటున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అభివృద్ధి చేసినా ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలో పొందలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరికీ మంచి చేయాలన్న జగన్ ఆలోచనను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారో అర్థం కావట్లేదన్నారు మార్గాని భరత్. ఏం తప్పులు చేశామో తెలియడం లేదన్నారు. రాజమండ్రి రెల్లి పేటలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా వైసీపీదే ఆధిక్యం అని, అలాంటి ప్రాంతాల్లో కూడా తమ పార్టీ వెనకపడిందని చెప్పారాయన. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించి సేవ చేశానని, సొంత వ్యాపారాలను సైతం పక్కనపెట్టి ప్రజాసేవే పరమావధి అనుకున్నానని, కుటుంబానికి కూడా సమయం కేటాయించకుండా జనం మధ్యే ఉన్నానని.. అయినా ఓడిపోయానని బాధపడ్డారు భరత్.
అభివృద్ధిని ధ్వంసం చేస్తారా..?
రాజమండ్రిలో మోరంపూడి శిలాఫలకాన్ని టీడీపీ నేతలు కూల్చేయడం దుర్మార్గం అన్నారు మార్గాని భరత్. ఓ శిలాఫలకం కూల్చేసి, మరోవైపు తాము క్రమశిక్షణకు మారుపేరు అని టీడీపీ నేతలు చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదన్నారు. రైతుల పేరుతో పచ్చ మూకలు రాజమండ్రిలో తమపై దాడి చేశాయని, ఆ దాడిని మాత్రమే తాము ప్రతిఘటించామని గుర్తు చేశారు. ప్రజా వేదిక కూల్చివేతలో తప్పులేదని, అది నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణం అని అన్నారు భరత్. వైసీపీ హయాంలో ప్రజలకు మంచే జరిగిందని, మరింత మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు వారికి ఓటు వేసి ఉంటారని వివరించారు.