తల్లికి వందనం ప్రభుత్వ బడులకేనా..? వైసీపీ అనుమానం
కూటమి ప్రభుత్వంలో కేవలం ప్రభుత్వ స్కూళ్లకే ఈ పథకాన్ని పరిమితం చేయాలనుకుంటున్నారని, ఆమేరకు లీకులిస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.
వైసీపీ హయాంలో అమలైన పథకాలకు టీడీపీ మార్పులు చేర్పులు చేయాలని చూస్తోంది. పేర్లు మార్చడమే కాదు విధి విధానాల్లో కూడా మార్పులుంటాయని చెబుతున్నారు. అమ్మఒడి మొత్తాన్ని పెంచి తల్లికి వందనం పేరుతో ఇస్తామని గతంలో కూటమి హామీ ఇచ్చింది. వైసీపీ హయాంలో ఒక బిడ్డకే అమ్మఒడి వస్తే, తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఈ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. తల్లికి వందనం పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న లీకులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.
తల్లికి వందనం పథకం అమలుపై ఈ లీకులేంటి @naralokesh..?
— YSR Congress Party (@YSRCParty) June 27, 2024
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలోకి వెళ్లిపోయారు
కనీసం ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇవ్వండి
-సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి pic.twitter.com/UVb6Xd86gt
ప్రభుత్వ బడులకేనా..?
గతంలో పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ లో ఎక్కడ చదువుతున్నా అర్హులైన తల్లుల ఖాతాల్లో అమ్మఒడి సొమ్ము జమ అయ్యేది. కూటమి ప్రభుత్వంలో కేవలం ప్రభుత్వ స్కూళ్లకే ఈ పథకాన్ని పరిమితం చేయాలనుకుంటున్నారని, ఆమేరకు లీకులిస్తున్నారని ఆరోపిస్తున్నారు సీదిరి అప్పలరాజు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోందన్నారు. త్వరలోనే ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయంలో విద్యార్థుల విద్యా దీవెన, వసతి దీవెన సొమ్ము కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాకుండా అప్పటి ప్రతిపక్షం అడ్డుకుందని, ఎన్నికల కమిష్ కి ఫిర్యాదు చేసి మరీ ఆపివేయించారని అన్నారు మాజీ మంత్రి అప్పలరాజు. చివరి విడత విద్యా దీవెన, వసతి దీవెన సొమ్ము వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. పథకాలను కొనసాగించే విషయంలో కావాలని ఆలస్యం చేస్తూ లబ్ధిదారులు నష్టపోయేలా చేయడం సరికాదని అంటున్నారు వైసీపీ నేతలు.