పబ్లిసిటీకోసం కార్యకర్తల్ని బలిచేశారు.. చంద్రబాబుపై వైసీపీ ఆరోపణలు
పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు ఇరుకు సందుల్లో సభలు నిర్వహించి జనాలు బాగా వచ్చారని చెప్పుకోవాలనుకున్నారని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ట్వీట్ చేశారు కొడాలి నాని.
నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత చంద్రబాబు తన ప్రసంగం ఆపేసి ఆస్పత్రికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు, చనిపోయినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించి, వారి పిల్లల బాధ్యత తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రమాదం సంచలనంగా మారింది. అయితే వైసీపీ నేతలు మాత్రం దీన్ని ఓ పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు ఇరుకు సందుల్లో సభలు నిర్వహించి జనాలు బాగా వచ్చారని చెప్పుకోవాలనుకున్నారని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ట్వీట్ చేశారు కొడాలి నాని. మృతుల కుటుంబాలకు సంతాపం చెబుతూనే, ప్రచార పిచ్చి ఇకనైనా తగ్గించుకో బాబూ అంటూ సూచించారాయన.
మరో మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికోసం కార్యకర్తల్ని బలిచేశారని అన్నారు. దాదాపుగా వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ.. కందుకూరు ఘటనను రాజకీయ కోణంతో ముడిపెట్టి చూశాయి. వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మాత్రం సంతాపం ప్రకటించారు. వైసీపీ కార్యకర్తలు, చోటా మోటా నేతలంతా సోషల్ మీడియాలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
కిక్కిరిసేంత జనాలు వచ్చారా..
ఇదేం ఖర్మ రాష్ట్రానికి.. అంటూ చంద్రబాబు చేపట్టిన యాత్రను టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో జరిగిన సభలకు భారీగా జనం తరలి వచ్చారని కథనాలిచ్చింది. ఇటు నెల్లూరులో కూడా జనం భారీగా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు నాయకులు. కందుకూరు, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు టూర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మొదటి రోజు కందుకూరులో జరిగిన సభలోనే ఘోరం జరిగిపోయింది. చంద్రబాబు సభకోసం ఇతర నియోజకవర్గాలనుంచి కూడా పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ లో జనం గుమికూడారు. అక్కడే పెద్ద డ్రైనేజీ కాల్వ ఉంది. సభ ప్రారంభం కాక ముందు నుంచీ టీడీపీ నాయకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కాల్వలో పడిపోతారు జాగ్రత్త అని మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. కానీ చివరకు అదే జరిగింది. చంద్రబాబు ప్రసంగం మొదలైన కాసేపటికే కొంతమంది తొక్కిసలాటలో ఆ కాల్వలో పడిపోయారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ 8మంది చనిపోవడం మాత్రం దారుణం. అనుకున్నట్టుగానే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కి చేరిందని, అందుకే 8మంది ప్రాణాలు బలి తీసుకున్నారంటూ వైసీపీ నుంచి విమర్శలు వినపడుతున్నాయి.