వైసీపీ 'మా నమ్మకం నువ్వే జగన్'.. జనసేన 'మాకు నమ్మకం లేదు దొరా'
వైసీపీ తలపెట్టిన కార్యక్రమం ఇంకా కార్యరూపం దాల్చకముందే దానికి కౌంటర్‌గా జనసేన పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఏపీలో అధికార వైసీపీ, జనసేన పార్టీల మధ్య స్టిక్కర్ల యుద్దం ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్ చరిష్మాతో నే గెలవాలని నిర్ణయం తీసుకున్నది. ఒకవైపు ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. దానికి తోడు వైఎస్ జగన్ పాపులారిటీని వాడుకోవాలని డిసైడ్ అయ్యింది. దీనిలో భాగంగా 'మా నమ్మకం నువ్వే జగన్' పేరుతో ముద్రించిన స్టిక్కర్లను ప్రతీ ఇంటికి అంటించనున్నది. స్టిక్కర్లను లబ్దిదారుల డోర్లకు అంటించడం వల్ల.. వాటిని ప్రతీ నిత్యం చూసి ప్రజలు తాము పొందిన ప్రతిఫలాలను గుర్తు చేసుకుంటారని వైసీపీ భావిస్తోంది.
కాగా, వైసీపీ తలపెట్టిన కార్యక్రమం ఇంకా కార్యరూపం దాల్చకముందే దానికి కౌంటర్‌గా జనసేన పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రానా నటించిన లీడర్ సినిమాలోని ఒక డైలాగ్ అయిన 'మాకు నమ్మకం లేదు దొర' అనే మాటలకు నిన్ను నమ్మలేం జగన్‌ను కూడా కలిపి స్టిక్కర్లపై ముద్రించి డోర్లకు అంటించాలని నిర్ణయించింది. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి విడుదల చేశారు. రాష్ట్రమంతటా ఈ స్టిక్కర్లను అంటించాలని ఇప్పటికే జనసేన నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వారికి ఈ స్టిక్కర్లు అందించాలని ప్లాన్ చేస్తోంది.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్, అధికార వైసీపీపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. తొమ్మిది నెలల్లోనే ఆర్బీఐ నుంచి రూ. 55,555 కోట్లు అప్పుగా తెచ్చారని.. ఆయనకు అప్పు రత్న అవార్డు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఇలాంటి కామెంట్లతోనే కార్టూన్లు కూడా విడుదల చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
కాగా, జనసేన చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం అప్పు తేవడం కూడా తప్పు అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇలాంటి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. స్టిక్కర్ల విషయంపై మాత్రం ఇంకా స్పందించలేదు.