ఈవీఎంలపై ఆరోపణలు.. వైసీపీకి లాభమేంటి..?
ఈవీఎంల లెక్కలు తేల్చాలని వైసీపీ అడుగుతోంది. అధికారులు మాత్రం వారి ముందు మాక్ పోలింగ్ నిర్వహించి సరిపెడుతున్నారు.
ఈవీఎంల గోల్ మాల్ వల్ల ఏపీలో కూటమి విజయం సాధించిందని, అది ప్రజా ప్రభుత్వం కాదని, ఈవీఎం ప్రభుత్వం అని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆరోపణలే కాదు, న్యాయ పోరాటం కూడా మొదలు పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈవీఎంల పనితీరుపై ఇప్పుడు విచారణ మొదలైంది. ఒంగోలులో ఈవీఎంల తనిఖీ విషయంలో రాద్ధాంతం జరిగింది. ఆల్రడీ జరిగిన పోలింగ్ లెక్కలు సరిచూడాలని, ఈవీఎం ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులు తనిఖీ చేయాలని వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేయగా, అధికారులు కేవలం మాక్ పోలింగ్ తో సరిపెట్టారు. దీంతో ఆయన తనిఖీ కార్యక్రమం నుంచి అర్థాంతరంగా బయటకొచ్చారు. తాజాగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈవీఎంల రీ వెరిఫికేషన్ రచ్చగా మారింది. అక్కడ కూడా ఇదే తంతు జరుగుతోంది.
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్‌లో 2 ఈవీఎంలను ఎన్నికల అధికారులు రీ వెరిఫై చేస్తున్నారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడ చిత్రమైన సంఘటన జరిగింది. ఈవీఎం భద్రపరచిన గది తాళాలను అధికారులు పోగొట్టారు. 3 గంటలు హడావిడి పడిన తర్వాత అదనంగా ఉన్న తాళం చెవి తెచ్చి ఆ రూమ్ తెరిచారు. చివరకు అక్కడ కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తుండటంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. కోర్టు తీర్పుని అధికారులు తప్పుగా అన్వయించి మాక్ పోలింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఈవీఎంలో పోలైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులు సరిపోలిస్తే తప్పు జరిగిందో లేదో తెలుస్తుందని అంటున్నారు వైసీపీ నేతలు.
బ్యాటరీ చార్జింగ్ గొడవ..
గజపతినగరం బూత్ నంబర్ 20లో పోలింగ్ రోజు ఓ ఈవీఎంలో కేవలం 50శాతం చార్జింగ్ ఉందట. కౌంటింగ్ రోజుకి అది 99శాతానికి పెరిగిందట. 84 రోజుల తర్వాత తనిఖీకి వెళ్లినప్పుడు కూడా చార్జింగ్ 99 శాతం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ చార్జింగ్ వ్యవహారం ఏంటో తేల్చాలంటున్నారు. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈవీఎంల లెక్కలు తేల్చాలని వైసీపీ అడుగుతోంది. అధికారులు మాత్రం వారి ముందు మాక్ పోలింగ్ నిర్వహించి సరిపెడుతున్నారు. శాంపిల్ ఓట్లు వేసి, వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతున్నారు. ప్రతిసారీ ఎన్నికల ముందు అధికారులు ఇదే ప్రక్రియ నిర్వహిస్తారు. ఇలా ఈవీఎం సామర్థ్యాన్ని నిర్థారించిన తర్వాతే పోలింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. దీనివల్ల వైసీపీ ఏం సాధిస్తుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇది కేవలం ఏపీకి సంబంధించిన విషయం కాదు, దేశవ్యాప్తంగా ఇవే ఈవీఎంలను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా మరికొన్ని పార్టీలు కూడా ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు మాక్ పోలింగ్ చేపట్టి ఆయా ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని, అంటే పోలింగ్ రోజు కూడా అవి సరిగానే పనిచేశాయని సర్టిఫై చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రయత్నానికి ఫలితం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. 2029నాటికి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పోరు జరపాలని కేంద్రంపై వైసీపీ ఒత్తిడి తేగలదా..? ఒకవేళ ఈవీఎంలతోనే పోలింగ్ కి ఎన్నికల కమిషన్ సిద్ధపడితే వైసీపీ కార్యాచరణ ఏంటనేది తేలాల్సి ఉంది.