Telugu Global
Andhra Pradesh

ఎన్నికలు అయ్యే వరకు ప్రతీ ఇంటికి తిరగాల్సిందే.. ఇదే వైసీపీ స్ట్రాటజీ!

సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇంత భారీ ప్రచారం చేయదు. కానీ, వైసీపీ తీరే వేరుగా కనిపిస్తోంది.

ఎన్నికలు అయ్యే వరకు ప్రతీ ఇంటికి తిరగాల్సిందే.. ఇదే వైసీపీ స్ట్రాటజీ!
X

ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కానీ వైసీపీలో మాత్రం అలాంటి ఆలోచన ఏమీ లేనట్లుగానే కనపడుతోంది. కానీ, త్వరలోనే ఎన్నికలు జరుగుతాయేమో అనే రీతిలో ప్రచారం మాత్రం చేస్తుంది. సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇంత భారీ ప్రచారం చేయదు. కానీ, వైసీపీ తీరే వేరుగా కనిపిస్తోంది.

ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ తిరిగారు. ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఎదురైనా.. చాలా వరకు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో ప్రభుత్వానికి అర్థం అయ్యింది. ఆ కార్యక్రమం మరింత కాలం కొనసాగించాలని అధినేత, సీఎం వైఎస్ జగన్ అంటున్నారు. దీనికి తోడు కొత్తగా మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ అనే రెండు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ప్రభుత్వం భారీగానే ప్రచారం చేసుకుంటోంది.

ఈ నెల 20 నుంచి జగనన్నే మా భవిష్యత్ పేరుతో ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజల్లోకి తీసుకొని వెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. వలంటీర్లతో కలసి గృహ సారథులు ఇళ్లను సందర్శిస్తారు. అక్కడే ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వారు ప్రచారం చేస్తారు. సచివాలయ కన్వీనర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు అందరూ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి డేటా ప్రభుత్వం వద్ద ఉన్నది. ఎవరెవరు ఎంత మేర లబ్ది పొందారు? ఒక కుటుంబానికి ఎంత మేర ప్రభుత్వ సాయం అందింది అన్న వివరాలు కూడా ఉన్నాయి. అలాంటి కుటుంబాల దగ్గరకు వారంలో రెండు సార్లు వెళ్లి అవే వివరాలు తెలియజేయనున్నారు. ఇక ప్రతీ ఇంటి ముందు జగనన్నే మా భవిష్యత్ అనే స్టిక్కర్ అంటించడంతో పాటు లబ్దిదారుల సెల్ ఫోన్లకు కూడా స్టిక్కర్లు అంటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, అధికార వైసీపీ ఎందుకు ఇంత భారీ ప్రచారం చేసుకుంటోందో ప్రతిపక్షాలకు కూడా అర్థం కావడం లేదు. ప్రతీ రెండు వారాలకు ఒక కొత్త ప్రచారంతో ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే, ఇదంతా ఐప్యాక్ వ్యూహాలే అని తెలుస్తున్నది. ప్రజలకు చేరువయ్యేలా ఉంటుందనే ఈ స్ట్రాటజీని అమలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకటికి నాలుగు సార్లు ప్రతీ ఇంటి వారిని పలకరించడం వల్ల ప్రభుత్వం తమకు దగ్గరగా ఉందనే భావన ప్రజల్లో కలుగుతుందని అంచనా వేసింది. ఈ వ్యూహం సీఎం జగన్‌కు కూడా నచ్చడంతోనే ఎలాంటి లోపం లేకుండా అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమాలు అన్నీ పార్టీకి తప్పకుండా లాభం చేకూరుస్తాయని పార్టీ భావిస్తోంది.

First Published:  15 Feb 2023 8:21 AM IST
Next Story