Telugu Global
Andhra Pradesh

వివేకాను అవినాష్ చంపడం మీరు చూశారా..?

వారిద్దరూ జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు విమల. ఇకనైనా నోరు మూసుకుని ఉండాలని హితవు పలికారు.

వివేకాను అవినాష్ చంపడం మీరు చూశారా..?
X

"మీరు చేస్తోంది తప్పు, ఇకనైనా నోరు మూసుకోండి.." అంటూ షర్మిల, సునీతపై వారి మేనత్త, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా ఆ ఇంటి ఆడపడుచునేనని, వైఎస్ ఇంటి ఆడపడుచులు ఆలా మాట్లాడడం సరికాదని చెప్పారామె. వివేకాను అవినాష్‌ చంపడం ఆ ఇద్దరూ చూశారా? అని నిలదీశారు. హంతకుడి మాటలు విని ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. పైగా సీఎం జగన్‌ను కూడా ఇందులోకి లాగుతున్నారని, వ్యక్తిగత కక్షతోనే షర్మిల, సునీత ఇలా చేస్తున్నారని మండిపడ్డారు విమల.

షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ ఉందా..?

షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ లేదని అన్నారు విమల. కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్నానంటూ ఆమె అభ్యర్థించే వీడియో చూశానని, నిత్యం అవినాష్ ని విమర్శిస్తూ ఓట్లు అడగడం చూస్తే ఆమె ఏ పాటి లీడరో అర్థమవుతోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారని.. తమ పనులు కావట్లేదని, తమకు పెత్తనం ఇవ్వట్లేదనే కక్షతోనే షర్మిల, సునీత ఏకమయ్యారని, జగన్ ని టార్గెట్ చేస్తున్నారని అన్నారామె.

మా ఇంటి ఆడపడుచులై ఉండి ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారని షర్మిల, సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు విమల. తమ కుటుంబంపై వారి ఆరోపణలు, మాటల్ని భరించలేకపోతున్నానని అన్నారు. హత్య చేసింది అవినాష్ అని వాళ్లిద్దరూ డిసైడ్ చేస్తే ఇక జడ్జీలు, కోర్టులు ఎందుకని ప్రశ్నించారు. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడని, అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా? అన్నారు విమల. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారని, మరోవైపు హత్య చేసిన వాడు సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారని, వారిద్దరూ జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు విమల. ఇకనైనా నోరు మూసుకుని ఉండాలని హితవు పలికారు.

First Published:  13 April 2024 11:03 AM IST
Next Story