జగన్ బొమ్మ తీసేశారు.. ఎల్లో మీడియా కళ్లు చల్లబడినట్టేనా..?
ఇప్పటి వరకూ సీఎం జగన్ బొమ్మలు ముద్రించేవారు. ఈ నెల నుంచి లబ్ధిదారులకు ఇచ్చే వాటిపై సీఎం బొమ్మలను తొలగించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ అనే పేరు కూడా మార్చేశారు.
"దిమ్మ తిరిగింది.. బొమ్మ చెదిరింది" అంటూ ఈనాడులో ఈ రోజు ఓ ఆర్టికల్ వచ్చింది. జగన్ బొమ్మలు కనపడితే ఎల్లో మీడియా ఎంత ఇదైపోతుందో తెలియజేసే కథనం ఇది. ఏపీలో గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పోషకాహార ప్యాకెట్లపై జగన్ బొమ్మ తొలగించారంటూ మహదానందపడిపోతూ ఆ కథనాన్ని వండివార్చారు. ఎట్టకేలకు జగన్ బొమ్మ తొలగించారని, ఆ పథకం పేరు కూడా మార్చారని చెప్పారు.
అసలేం జరిగింది..?
ఏపీతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గర్భిణిలు, బాలింతలకు పోషకాహారం పంపిణీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీనికి కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్రాలు అదనంగా కొంత ఖర్చు పెడుతుంటాయి. అయితే ఈ పోషకాహార ప్యాకెట్లపై ఏపీలో సీఎం జగన్ బొమ్మలు ముద్రించడాన్ని టీడీపీ అనుకూల మీడియా తప్పుబట్టింది. కేంద్రం నిధులిస్తే జగన్ బొమ్మలు ఎలా వేసుకుంటారని ప్రశ్నించింది. ఇదే విషయంపై కేంద్రానికి కూడా ఫిర్యాదులందాయి. దీంతో కేంద్రం నిజనిర్ధారణ చేపట్టింది. ఫొటోలంటే మోదీకి మహా మోజు అనేది అందరికీ తెలిసిన విషయమే. పైగా మోదీ ఫొటోలు లేకుండా జగన్ ఫొటో మాత్రమే వేసుకోవడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదు. దీంతో కేంద్రం అడ్డం తిరిగింది. గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ తదితర శాఖల్లో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాలపై జగన్ బొమ్మను తొలగించే వరకు నిధులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
కేంద్ర నిధులతో రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పేరుతో పోషకాహారం ప్యాకెట్లు అందిస్తోంది. వీటిపై ఇప్పటి వరకూ సీఎం జగన్ బొమ్మలు ముద్రించేవారు. ఈ నెల నుంచి లబ్ధిదారులకు ఇచ్చే వాటిపై సీఎం బొమ్మలను తొలగించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ అనే పేరు కూడా మార్చేశారు. ఆ స్థానంలో సాక్షం అంగన్వాడీ పోషణ 2.0 పేరును ముద్రించారు. ఈ మార్పు ఎల్లో మీడియాకు ఎక్కడలేని సంతోషాన్నిచ్చింది. జగన్ బొమ్మలు తీసేశారంటూ సంబరపడుతూ వార్తల్ని వండివారుస్తోంది.
♦