వైఎస్ఆర్ ప్లేస్ లో ఎన్టీఆర్.. జీవో విడుదల
పాలనలో మార్పు చూపెడతానంటున్న సీఎం చంద్రబాబు, ముందుగా పథకాల పేర్లు మార్చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో పథకాలు వైఎస్ఆర్, లేదా జగనన్న పేరుతో మొదలయ్యేవి. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కొకటీ మార్చుకుంటూ పోతూన్నారు. వైఎస్ఆర్ ప్లేస్ ని ఎన్టీఆర్ తో భర్తీ చేస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఇకపై ఎన్టీఆర్ భరోసా అని పిలవాలంటూ కొత్త ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇటీవలే జగనన్న విద్యా కానుక పేరుని స్టూడెంట్ కిట్‌గా మార్చారు. ఇప్పుడు పెన్షన్ కానుక పేరుని అధికారికంగా మార్చేస్తూ జీవో విడుదల చేశారు.
మార్పు మొదలైనట్టేనా..?
పాలనలో మార్పు చూపెడతానంటున్న సీఎం చంద్రబాబు, ముందుగా పథకాల పేర్లు మార్చేస్తున్నారు. ప్రస్తుతానికి పెన్షన్లు పెంచుతూ ఫైల్ పై సంతకం పెట్టారు కాబట్టి ఆ పథకం పేరు మార్చేశారు. మిగతా పథకాల విషయంలో కూడా త్వరలో కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కేవలం పథకాలకే కాదు, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ వంటి విషయాల్లో కూడా పేరు మార్పు అనివార్యంలా కనపడుతోంది. ఇప్పటికే టీడీపీ అభిమానులు పాత పేర్లను అనధికారికంగా తొలగించేశారు, జీవోలు విడుదలవడమే ఇక మిగిలుంది.
2014లో అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ పేరు లేకుండా చంద్రబాబు తన సొంత పేరు ప్రమోట్ చేసుకోవాలని చూశారు. చంద్రన్న కానుక, చంద్రన్న బీమా అంటూ.. కొన్ని పథకాలకు తన పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్, జగనన్న అనే పేరుతో ఉన్న అన్ని పథకాలకు ఎన్టీఆర్ అనే పేరు పెడతారా, లేక కొన్నిటికి చంద్రన్న అనే ట్యాగ్ లైన్ జోడిస్తారా.. అనేది వేచి చూడాలి. తొలి మార్పు ఎన్టీఆర్ పేరుతోనే మొదలవడం విశేషం.