వైఎస్సార్ బీమా నిరుపేదలకు ధీమా
ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షలు, 18-70 ఏళ్ల లోపు సహజ మరణం పొందినవారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. తక్షణ సాయంగా అంత్యక్రియలకు రూ.10 వేలను అందిస్తారు.
అనుకోకుండా ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చి కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడుతుంది. అయితే, అటువంటి పరిస్థితిని ఏ కుటుంబం కూడా ఎదుర్కోకూడదని భావించి పెద్ద దిక్కు కోల్పోయిన స్థితిలో ఆ కుటుంబం వీధిన పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన చేసి వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో నిరుపేదలకు ఓ భరోసా ఏర్పడింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 22వ తేదీన వైఎస్సార్ బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సుగల వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించినా, వృద్ధాప్యం తదితర కారణాలతో తనుపు చాలించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది. కుటుంబంలో నామినీగా ఉన్న వ్యక్తికి ఆ సొమ్ము అందుతుంది.
ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షలు, 18-70 ఏళ్ల లోపు సహజ మరణం పొందినవారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. తక్షణ సాయంగా అంత్యక్రియలకు రూ.10 వేలను అందిస్తారు.
ఉదాహరణకు ఒక్క కడప జిల్లానే తీసుకుంటే.. గత ఏడాది జులై నుంచి ఇప్పటి వకు వైఎస్సార్ బీమా పథకం కింద సహజ మరణాలు 572 నమోదయ్యాయి. అందులో ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 481 కుటుంబాలకు మొత్తం రూ.4.81 కోట్లు బీమా సొమ్ము అందింది. వివిధ ప్రమాదాల్లో 111 మంది మరణించగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 85 మందికి రూ.4.25 కోట్ల నగదు అందింది.
మొత్తం 683 మందికి 566 కుటుంబాలకు చెందిన నామినీలకు మొత్తం రూ.9.06 కోట్ల నగదు పంపిణీ జరిగింది. బీమాకు సంబంధించిన పత్రాలను సమర్పించిన 21 రోజుల లోపలే ప్రభుత్వం నామినీ ఖాతాలకు బీమా సొమ్ము జమ చేసింది.