బాబు బాధపడుతున్నట్లు.. ఆయన వయసొక్కటే ఎందుకు టార్గెట్ అవుతుందబ్బా!
చంద్రబాబు మాట్లాడితే తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని పాటెత్తుకుంటారు. ఢిల్లీలో చక్రం తిప్పానని పదేపదే గుర్తుచేస్తారు.
చంద్రబాబు సమకాలీన రాజకీయాల్లో చాలా సీనియర్ లీడర్. అయితే ఆ సీనియార్టీనే ప్రత్యర్థి వైసీపీ ఎత్తిచూపుతోంది. వయసైపోయిందని, ముసలాయన అంటూ చంద్రబాబును పదేపదే ఎత్తిపొడుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల దాకా అవే మాటలు వాడుతున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణ చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాట్లాడుతూ.. చంద్రబాబును ముసలినక్క అనాలంటే తనకు బాధగా ఉందంటూనే భారీగా ట్రోల్ చేసేశారు.
మోడీని అనగలిగే దమ్ముందా..?
ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాని మోడీ, బీహార్ సీఎం నితీష్‌కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తన తోటివారేనని చంద్రబాబు నిన్న ఢిల్లీలో మీడియాతో అన్నారు. జగన్ ప్రధాని మోడీని ముసలోడా అనగలగడా అని ప్రశ్నించారు. వాస్తవానికి మోడీ, నితీశ్ కుమార్‌లు చంద్రబాబు కంటే ఒకటి రెండేళ్లు చిన్నవారే.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నందుకేనా..?
చంద్రబాబు మాట్లాడితే తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని పాటెత్తుకుంటారు. ఢిల్లీలో చక్రం తిప్పానని పదేపదే గుర్తుచేస్తారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో చంద్రబాబు కీలకపాత్రే పోషించారు. కానీ, పదేపదే అదే చెప్పుకోవడంతో ఆ స్వోత్కర్ష వినలేక సొంత పార్టీలో నాయకులే పక్కకెళ్లి విసుక్కుంటుంటారు. ఇదే వైసీపీ నాయకులకు చంద్రబాబును ట్రోల్ చేయడానికి అవకాశం ఇస్తోంది. నిన్న ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో తన వయసు గురించి కామెంట్లు చేసేవారిమీద విరుచుకుపడుతూ కూడా చంద్రబాబు ఈ సెల్ఫ్ డబ్బా ఆపలేదని వైసీపీ లీడర్లు గుర్తు చేస్తున్నారు. తన సీనియార్టీతో దేశానికి ఉపయోగపడే చాలా విధానాలు తీసుకొచ్చానని, హైదరాబాద్ అభివృద్ధి అందులో ఒకటని ఆయన చెప్పడం చంద్రబాబులోని ప్రచార కాంక్షను చాటిచెబుతోంది. అందుకేనేమో వైసీపీ వాళ్లు చంద్రబాబును వయసైపోయిందని, చాదస్తం పెరిగిపోయి చెప్పిందే మళ్లీమళ్లీ చెబుతున్నారని ట్రోల్ చేస్తున్నారు.
*