సీబీఐ ఆఫీస్ లో అవినాష్.. నిన్న 8 గంటలు, ఈరోజు 9 గంటలు
నిన్న(బుధవారం) 8గంటల సేపు విచారణ జరుపగా ఈరోజు(గురువారం) మొత్తం 9గంటల విచారణ ఎదుర్కొన్నారు అవినాష్ రెడ్డి.
ఐదో విడతలో రెండో రోజు.. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ఈరోజు కూడా పెద్దగా హడావిడి లేదు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీస్ కి వెళ్లిన ఆయన సాయంత్రం బయటకొచ్చారు. మొత్తం 9గంటలసేపు సుదీర్ఘ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. నిన్న(బుధవారం) 8గంటల సేపు విచారణ జరుపగా ఈరోజు(గురువారం) మొత్తం 9గంటల విచారణ ఎదుర్కొన్నారు అవినాష్ రెడ్డి.
వివేకా హత్యను గుండెపోటుగా ఎవరు చిత్రీకరించారంటూ సీబీఐ అధికారులు ఆరా తీశారని, హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ వివేకా ఇంటి దగ్గరే ఉన్నట్టు గుర్తించారని.. దానిపై ప్రశ్నలు సంధించారని బయటకు వార్తలు వస్తున్నా.. వాటిని ఎవరూ ధృవీకరించలేదు. అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా సీబీఐ విచారించినట్టు తెలుస్తోంది.
ఆ ఇద్దరికీ ముగిసిన కస్టడీ..
ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి... సీబీఐ కస్టడీ ఈరోజుతో ముగిసింది. రెండురోజులపాటు వారిద్దరికీ సీబీఐ పలు ప్రశ్నలు సంధించింది. రెండోరోజు ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించారు సీబీఐ అధికారులు. దాదాపు 7 గంటలసేపు వారిద్దర్నీ విచారించారు. రెండు రోజుల కస్టడీ ముగియడంతో ఆ ఇద్దర్నీ చంచల్ గూడ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు. రేపు(శుక్రవారం) అవినాష్ రెడ్డి విచారణ మాత్రమే కొనసాగుతుంది.