అమ్మ ఆశీర్వాదం నాకే.. షర్మిలకు నామినేషన్ కష్టాలు
తండ్రి సమాధి వద్ద నామినేషన్ పత్రాలు పెట్టి, తల్లి ఫొటోలను ట్విట్టర్లో పెట్టి హడావిడి చేశారు షర్మిల.
కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. కనీసం నామినేషన్ రోజయినా తల్లి విజయమ్మ తనతో ఉంటారని, తనకు సపోర్ట్ చేస్తారని ఆమె భావించారు. కానీ సాధ్యం కాలేదు. అందుకే ఈరోజు తల్లి విజయమ్మ ఫొటోలు పెట్టి ఆమె ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పుకొచ్చారు షర్మిల. కనీసం షర్మిలను ఆశీర్వదిస్తూ విజయమ్మ ఎలాంటి వీడియో చేయలేదు, రాబోయే రోజుల్లో అయినా ఆమె ప్రచారానికి వస్తారని అనుకోలేం. షర్మిలను సపోర్ట్ చేస్తే, జగన్ ని వ్యతిరేకించినట్లవుతుందని ఆమె ఇద్దరికీ దూరంగానే ఉన్నారు. కానీ షర్మిలకు మాత్రం తండ్రి అభిమానుల ఓట్లు కావాలి. అందుకే ఆమె విజయమ్మ ఫొటోలతో ఆమె హడావిడి చేస్తున్నారు. తాజాగా నామినేషన్ సందర్భంగా తల్లి ఫొటోలు ట్విట్టర్లో పెట్టి ఆమె ఆశీస్సులు తనకే ఉన్నాయంటున్నారు.
ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను.
— YS Sharmila (@realyssharmila) April 20, 2024
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మరిచి పోలేని ప్రజలు, అందరూ… pic.twitter.com/1cBaoePyiA
తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టినప్పుడు షర్మిలకు తల్లి విజయమ్మ అండగా నిలిచారు. ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్నారు. కూతురి రాజకీయ భవిష్యత్ కోసం కష్టపడ్డారు. చివరకు అక్కడ పోటీలో లేకుండా షర్మిల తప్పుకున్నారు, కాంగ్రెస్ లో చేరారు. ఇక ఏపీలో మాత్రం షర్మిలకోసం విజయమ్మ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. ఏపీ ఎన్నికల సమయంలో విజయమ్మ విదేశాలకు వెళ్లిపోయారు. కానీ తల్లి సెంటిమెంట్ ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు షర్మిల విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు నన్ను ఆశీర్వదించి మీ ఆడబిడ్డకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. pic.twitter.com/Mxp0zmr5GV
— YS Sharmila (@realyssharmila) April 20, 2024
ఈరోజు నామినేషన్ పత్రాలను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేశారు షర్మిల. ఆ తర్వాత సోదరి సునీతతోపాటు ఆర్వో కార్యాలయానికి వెళ్లి వాటిని సమర్పించారు. ఈ ఎపిసోడ్ లో తల్లి ఆశీర్వాదం అనేది షర్మిల మైండ్ గేమ్ కి పరాకాష్ట. తల్లి విజయమ్మ మద్దతు తనకే ఉందని చెప్పుకోడానికి, ఆమె ఫొటోలను ట్విట్టర్లో వాడుకున్నారు షర్మిల.