హోదాకోసం ఏం చేశారు..? జగన్ ని నిలదీసిన షర్మిల
చంద్రబాబు గారూ అంటూ ఆయనపై ఎక్కడ లేని గౌరవం చూపించిన షర్మిల, జగన్ రెడ్డి అంటూ.. అన్నని సంబోధించిన తీరు మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే.. సీఎం జగన్ ని టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. హోదాకోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు, జగన్ ఇద్దరూ ప్రధాన కారకులని విమర్శించారు. హోదా వచ్చి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. చంద్రబాబు అమరావతి అంటూ ఊరించారని, జగన్ వచ్చి మూడు రాజధానులని చెప్పి ఒక్కటీ కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. నేను రెడీ.. మీరు రెడీయా అంటూ.. సభలో కాంగ్రెస్ శ్రేణుల్ని హుషారెత్తించారు షర్మిల.
అనుకున్నట్టుగానే షర్మిల స్వరం పెంచారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఆమె అన్న జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. పనిలో పనిగా టీడీపీని కూడా టార్గెట్ చేశారు. టీడీపీ, వైసీపీ దొందూ దొందేనన్నారు. గత పదేళ్లలో ఆ రెండు పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.లక్ష కోట్లు అప్పు ఉందని, చంద్రబాబు దాన్ని రూ.2లక్షల కోట్లు చేస్తే.. ప్రస్తుత సీఎం జగన్ రూ.3లక్షల కోట్లకు పైగా అప్పు చేశారన్నారు. చంద్రబాబు గారూ అంటూ ఆయనపై ఎక్కడ లేని గౌరవం చూపించిన షర్మిల, జగన్ రెడ్డి అంటూ.. అన్నని సంబోధించిన తీరు మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Live : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా శ్రీమతి @realyssharmila గారి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం. https://t.co/7MWYq4usad
— INC Andhra Pradesh (@INC_Andhra) January 21, 2024
ఇప్పుడేమైంది జగన్ రెడ్డీ..?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకోసం అవిశ్వాస తీర్మానం సహా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్న జగన్ రెడ్డి.. ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు షర్మిల. స్వలాభం కోసం వైసీపీ, ఏపీ స్పెషల్ స్టేటస్ ని తాకట్టు పెట్టిందన్నారు. ఏపీకీ స్పెషల్ స్టేటస్ లేదంటే ఆ పాపం చంద్రబాబు, జగన్ దేనన్నారు షర్మిల. జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభిస్తే.. ఇప్పటికీ దాన్ని పూర్తి చేసుకోలేని దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నామన్నారు. బీజేపీ దోస్తీ కోసం చంద్రబాబు, జగన్ ఇద్దరూ పోలవరాన్ని తాకట్టు పెట్టారన్నారు షర్మిల. ఏపీకి ఉన్న ఎంపీలంతా బీజేపీ ఏం చెబితే దానికి గంగిరెద్దుల్లా తల ఊపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ దుస్థితి..
రోడ్లు వేసుకోవడానికి కూడా ఏపీలో నిధుల్లేని పరిస్థితి ఉందని, ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు షర్మిల. దేనికీ డబ్బు లేదని, అభివృద్ధి జరగడం లేదని, దళితులపై దాడులు మాత్రం వంద శాతం పెరిగాయన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తానికి షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. మరి షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ నుంచి కౌంటర్లు ఉంటాయో లేదో చూడాలి.