కడపలో నా ఓటమికి కారణం అదే -షర్మిల
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తాను అన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చిందని, అందుకే కడపలో ఎక్కువ మంది ప్రజలకు చేరువ కాలేకపోయానని అన్నారు షర్మిల.
ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓట్లు, సీట్లు వస్తాయని ఎవరూ ఆశించలేదు. ఆ మాటకొస్తే కడప పార్లమెంట్ స్థానంలో కూడా షర్మిల హడావిడి చేశారే కానీ ఆమె చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేకపోయారు. కేవలం 11 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన షర్మిల.. తన ఓటమికి కారణాలు వివరించారు.
అప్పటి సీఎం జగన్, సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి.. కడప ప్రజల్ని భయపెట్టారని, అందుకే కడప ఓటర్లు తనకు ఓటు వేయలేదని చెప్పారు షర్మిల. షర్మిలకు ఓటు వేశారని తెలిస్తే తమను ఇబ్బంది పెడతారని కడప ప్రజలు భయపడ్డారని అన్నారు. మరోవైపు వైసీపీ అధికారంలోకి వస్తే, తమకు ఎదురు తిరిగిన వారికి పథకాల్లో కోత పెడతారనే ప్రచారం కూడా జరిగిందని, అందుకే కడప ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేయలేదన్నారు షర్మిల. పథకాలు పోతాయనే భయంతో అందరూ వైసీపీకి ఓటు వేశారన్నారు.
వైసీపీ ఒక్కో ఓటుకి రూ.3,500 పంపిణీ చేసిందని, ఓటర్లను ఆ పార్టీ నేతలు ప్రలోభ పెట్టారని మండిపడ్డారు షర్మిల. ఇక తనకు టైమ్ తక్కువగా ఉండటం కూడా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తాను అన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చిందని, అందుకే కడపలో ఎక్కువ మంది ప్రజలకు చేరువ కాలేకపోయానని అన్నారు షర్మిల. గ్రామీణ ప్రాంతాల్లో తాను పోటీ చేస్తున్నట్టు కూడా చాలామందికి తెలియదని, అందుకే తాను ఓడిపోయానని చెప్పారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనా లోక్ సభ విషయంలో ఊహించని స్థాయిలో 4 సీట్లు గెలుచుకుంది. కడపలో అవినాష్ రెడ్డి టఫ్ ఫైట్ ఎదురైనా గెలిచారు. అయితే అక్కడ షర్మిల పోటీతో టీడీపీ ఓట్లు భారీగా చీలాయనే వాదన కూడా ఉంది. షర్మిల పోటీ వల్లే అవినాష్ రెడ్డి గెలిచారని టీడీపీ నేతలు అంటున్నారు.