Telugu Global
Andhra Pradesh

మూడు రాజధానులే గెలిపిస్తాయి.. సర్వేలతో ఫిక్స్ అయిన సీఎం జగన్

అమరావతి రాజధాని విషయంలో జరిగిన అవకతవకలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో వైసీపీ విజయవంతం అయ్యింది. ఒక సామాజిక వర్గం వారికి లాభదాయకంగా మారిందనే విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ వస్తోంది.

మూడు రాజధానులే గెలిపిస్తాయి.. సర్వేలతో ఫిక్స్ అయిన సీఎం జగన్
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో సారి వైసీపీని అధికారంలోకి తీసుకొని రావాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. పార్టీ సమావేశాల్లో ఈ సారి వైసీపీకి 175కి 175 సీట్లు రావాలని, అందు కోసం తీవ్రంగా కష్టపడాలని నాయకులు, కార్యకర్తలకు చెబుతున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ 'నవ రత్నాలు'తో 2019లో అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని కూడా ప్రజలకు వివరిస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం 'మూడు రాజధానులు' ఎన్నికల నినాదంగా ఫిక్స్ చేయాలని జగన్ భావిస్తున్నారు.

అమరావతి రాజధానిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలనే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టడం తమ ప్రభుత్వానికి అనుకూలమని జగన్ అనుకుంటున్నారు. ప్రతిపక్షాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హైకోర్టులో రాజధాని విషయంలో పలు పిటిషన్లు వేశాయి. ముఖ్యంగా టీడీపీ అమరావతే రాజధాని అంటూ ఫిక్స్ అయిపోయింది. కాగా, అమరావతి రాజధాని విషయంలో జరిగిన అవకతవకలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో వైసీపీ విజయవంతం అయ్యింది. ఒక సామాజిక వర్గం వారికి లాభదాయకంగా మారిందనే విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ వస్తోంది. ప్రజలు కూడా అమరావతి విషయంలో టీడీపీని దోషిగానే చూస్తున్నారు.

జగన్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వాటి ద్వారా రాష్ట్రంలో భారీ సంఖ్యలో ప్రజలు లబ్దిపొందుతున్నారు. అయితే, వాటిని చూపించి ఓటేయాలని ప్రజల్లోకి వెళ్లినా అంత స్పందన వస్తుందో లేదో తెలియదు. అందుకే మూడు రాజధానుల వంటి భావోద్వేగ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ జగన్ గతంలోనే ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది అంతగా వర్కవుట్ అవుతుందా లేదా అనే విషయంలో పార్టీలోని సీనియర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో గత కొన్ని నెలలుగా వైఎస్ జగన్ పలు మార్గాల ద్వారా సర్వే చేయించారు.

మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై వైఎస్ జగన్ నిర్ణయం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు వికేంద్రీకరణకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఎన్నాళ్లుగానో వెనుకబడిన తమ ప్రాంతాలకు ఏదో ఒక రాజధాని రావడం వల్ల అభివృద్ధి జరగడంతో పాటు గుర్తింపు కూడా వస్తుందని భావిస్తున్నారు. ఆరు నెలల కిందట చేయించిన సర్వేతో పోలిస్తే.. ప్రస్తుతం మూడు రాజధానుల పట్ల మరో 10 శాతం మంది అధికంగా సానుకూలంగా ఉన్నట్లు తేలింది. దీనికి తోడు సుప్రీంకోర్టు కూడా రాజధానుల విషయంలో హైకోర్టును కలుగజేసుకోవద్దనే విధంగా వ్యాఖ్యలు చేయడం వైఎస్ జగన్ నిర్ణయానికి బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది.

టీడీపీ, జనసేన, బీజేపీ సహా వామపక్ష పార్టీలు కూడా అమరావతే రాజధాని అనే నినాదంతో వెళ్తున్నాయి. వైసీపీ మాత్రం మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్నది. ఈ నినాదం అమరావతి ప్రాంతంలో కాస్త వ్యతిరేకతను చూపించినా.. మిగిలిన ప్రాంతాల ప్రజలకు మాత్రం అనుకూలంగానే ఉంటుంది. జగన్ చేయించిన సర్వేలో కూడా ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లోనే కాస్త వ్యతిరేకత ఉన్నది. ఇది ముందుగానే అంచనా వేశారు. కాబట్టి ఇప్పటికే అమలు చేసిన సంక్షేమ పథకాలకు, మూడు రాజధానుల నినాదం జత కలిస్తే వైసీపీకి తిరుగు ఉండదని జగన్ నిర్ణయానికి వచ్చారు.

రాబోయే ఎన్నికలు అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీని ఈ నిర్ణయం తప్పకుండా గెలిపిస్తుందని కూడా భావిస్తున్నారు. పలు సర్వేల ద్వారా ప్రజల నాడిని తెలుసుకున్న సీఎం జగన్.. ఆ నినాదాన్ని ఎత్తుకున్నారు. అవసరం అయితే మరి కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రకటిస్తే ప్రభుత్వ వ్యతిరేకత కూడా తగ్గిపోతుందని జగన్ అంచనా వేస్తున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత వైసీపీలో కొత్త జోష్ వచ్చింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైందే అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది.

First Published:  29 Nov 2022 7:36 AM IST
Next Story