చంద్రబాబును ఫుల్లుగా ర్యాగింగ్ చేస్తున్నారా?
జగన్ ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు టార్గెట్‌గా వెన్నుపోటు, దుష్టచతుష్టయం, ఎల్లోమీడియా, బైబై బాబు, గుడ్ బై బాబు అంటు పదేపదే ప్రస్తావిస్తున్నారు.
చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఫుల్లుగా ర్యాగింగ్ చేసేస్తోంది. మామూలుగా అయితే విద్యాసంస్ధల్లో ర్యాగింగ్ నిషేధం. కానీ ఇక్కడ జరుగుతున్నది పొలిటికల్ ర్యాగింగ్ కాబట్టి వైసీపీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేసిన, చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు. బహిరంగ సభల్లో ఏ ముఖ్యమంత్రి అయినా చేసేదిదే.
అయితే పాలనా వ్యవహారాలు ముగిసిన తర్వాత ప్రతిపక్షాల నేతలు, ఎల్లో మీడియా గురించి ప్రస్తావించారు. అప్పుడే చంద్రబాబు టార్గెట్‌గా ర్యాగింగ్ మొదలుపెట్టారు. పార్టీ పెట్టుకుని గెలిపిస్తే అలాంటి వాళ్ళని ఎంజీఆర్, ఎన్టీయార్ లేదా జగన్ అని అంటారని చెప్పారు. ఎవరో పెట్టిన పార్టీని కబ్జా చేస్తే, వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటే అలాంటివాళ్ళని చంద్రబాబు అని అంటారని చెప్పారు. ఇక్కడి నుండి చంద్రబాబు, ఎల్లో మీడియాను ఉద్దేశించి వెన్నుపోటు వ్యవహారం, రావణాసురుడు, దుర్యోధనుడు, దుష్టచతుష్టయం లాంటి అనేక ఉపమానాలతో రెచ్చిపోయారు.
జగన్ ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు టార్గెట్‌గా వెన్నుపోటు, దుష్టచతుష్టయం, ఎల్లోమీడియా, బైబై బాబు, గుడ్ బై బాబు అంటు పదేపదే ప్రస్తావిస్తున్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటుపొడిచిన చంద్రబాబుకు మళ్ళీ అధికారం ఎందుకివ్వాలంటు జనాలను ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వందలాది హామీలిచ్చి అన్నింటినీ గాలికొదిలేసి చివరకు మ్యానిఫెస్టోను కూడా పార్టీ వెబ్ సైట్ నుంచి మాయం చేసిన చంద్రబాబుకు ఎందుకు ఓట్లేయాలో ఆలోచించుకోవాలని జనాలకు చెబుతున్నారు.
తన పాలనలో మంచి జరిగిందని అనుకుంటే ఓట్లేయమని తాను జనాలను అడుగుతుంటే చంద్రబాబేమో వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు కాబట్టి ఓట్లేయాలని జనాలను బెదిరిస్తున్నారని జగన్ మండిపడుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి చూసి ఓట్లేయమని తాను అడుగుతుంటే, తన ఏడుపు చూసి, బాధ చూసి టీడీపీని గెలిపించాలని చంద్రబాబు జనాలను బెదిరిస్తున్నారంటు జగన్ జనాలకు చెబుతున్నారు. ఒకవైపు ఎల్లో మీడియా జగన్‌కు వ్యతిరేకంగా రెచ్చిపోయే కొద్దీ జగన్ కూడా ఎల్లో బ్యాచ్‌పై మండిపోతున్నారు. తన 40 ఇయర్స్ లో చంద్రబాబు కానీ లేదా ఎల్లో మీడియా కానీ ఇప్పటిలాగ ఎప్పుడూ ర్యాగింగ్‌కు గురైంది లేదనే చెప్పాలి.