Telugu Global
Andhra Pradesh

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమంతా అవినీతి, స్కామ్‌లతో నిండిపోయింది : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవినీతి ఎక్కువైపోయిందని అన్నారు. కేంద్రం ఇస్తున్న డబ్బులను 'రైతు భరోసా' అనే పేరుతో వైఎస్ జగన్ ఇక్కడ పంపిణీ చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని అమిత్ షా ఆరోపించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప మరేం లేదు. సీఎం జగన్ తనది రైతుల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కానీ దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. రైతు ఆత్మహత్యల విషయంలో సీఎం జగన్ సిగ్గుపడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ప్రధాని మోడీ పరిపాలనకు 9 ఏళ్లు ముగిసిన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం విశాఖపట్నంలోని రైల్వే గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవినీతి ఎక్కువైపోయిందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న డబ్బులను 'రైతు భరోసా' అనే పేరుతో వైఎస్ జగన్ ఇక్కడ పంపిణీ చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న ఇళ్లను కూడా తన పథకంగా చెప్పుకుంటున్నారు. కరోనా మొదలైన దగ్గరి నుంచి 5 కిలోల ఉచిత బియ్యం పేదలకు ఉచితంగా ఇస్తున్నాము. ప్రధాని మోడీ రేషన్ బియ్యం ఇస్తుంటే.. ఆ బ్యాగులపై వైఎస్ జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పంటలకు మద్దతు ధర కూడా పెంచామని అమిత్ షా తెలిపారు.

దేశవ్యాప్తంగా 230 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఉచితంగా బీజేపీ ప్రభుత్వం అందించిందని చెప్పారు. 2009 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం ఏపీకి రూ.78 వేల కోట్లు ఇచ్చింది. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-2019 మధ్య రూ.2,70.000 కోట్లు నిధులు ఇచ్చాము. ఆ డబ్బంతా ఎటు పోయిందని అమిత్ షా ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్లలో ఏపీ అభివృద్ధి కోసం రూ.5 లక్షల కోట్లు ఇచ్చాము. కానీ కేంద్రం ఇచ్చిన నిధుల మేర అభివృద్ధి రాష్ట్రంలో కనిపించడం లేదని అమిత్ షా దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన డబ్బంతా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని అవినీతి ఖాతాలోకే వెళ్లిందని తీవ్ర విమర్శలు చేశారు.

జగన్ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నం కబ్జాదారులకు అడ్డాగా మారింది. ఈ నగరంలో భూకబ్జాలు, మైనింగ్ కుంభకోణాలు జరగుతున్నాయని అమిత్ షా ఆరోపించారు. నాలుగేళ్లలో జగన్ సర్కారు అంటే అవినీతి, కుంభకోణాలకు అడ్రస్‌గా మారిందని ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి 4 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే.. ఇప్పుడు అది 11 వేల కిలోమీటర్లకు విస్తరించిందని చెప్పారు. జాతీయ రహదారుల కోసమే కేంద్రం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఏపీకి రెండు వందే భారత్ రైళ్లు మంజూరు చేశాము. ఒకటి సికింద్రాబాద్, మరొకటి తిరుపతికి విశాఖ నుంచే నడుస్తున్నాయని అన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను రూ.450 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము. కడప, కర్నూలులో విమానాశ్రయాలు ఏర్పాటు చేశాము. అనేక కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేశాము. మూడు కొత్త మెడికల్ కాలేజీలు కూడా మంజూరు చేశామని అమిత్ షా చెప్పారు.

యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. కానీ, నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. నరేంద్ర మోడీ పాలనలో దేశం పూర్తి అంతర్గత రక్షణ కలిగి ఉన్నది. పుల్వామాలో దాడి జరిగిన పది రోజుల్లోనే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్‌కు బుద్ది చెప్పామని చెప్పారు. ఈ రోజు భారత సరిహద్దును ఎవరూ టచ్ చేయలేరని అన్నారు. 2024లో కూడా మోడీ ప్రధాని కావడం ఖాయం. 300 సీట్లను బీజేపీ గెలుచుకుంటుంది. అయితే ఏపీ ప్రజలు బీజేపీకి 25కి గాను 20 సీట్లు గెలిపించి ఆశీర్వదించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.

First Published:  11 Jun 2023 8:13 PM IST
Next Story