అసెంబ్లీకి వెళ్లాలా..వద్దా..జగన్ నిర్ణయం ఇదే!
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 మంది సభ్యుల బలంతో సభకు వెళ్లడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత సాధారణ ఎమ్మెల్యేలతో అల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ప్రమాణస్వీకారం చేయిస్తారని సమాచారం. ఐతే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ కూడా సాధారణ ఎమ్మెల్యేలతోనే ప్రమాణం చేయనున్నారు.
ఐతే భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంపై జగన్ డైలమాలో ఉన్నారని సమాచారం. ఇదే అంశంపై వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ జగన్ ఏమన్నారంటే..మనకు ప్రజలు ఇచ్చిన బలం చాలా తక్కువ. దాంతో అసెంబ్లీలో మనం చేయగలిగేది తక్కువే. స్పీకర్‌గా ఎంపికయ్యే వ్యక్తి ఇప్పటికే వైసీపీ టార్గెట్‌గా చేస్తున్న కామెంట్స్ మనం వింటున్నాం. జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు. చచ్చేదాకా కొట్టాలని ఆయన అంటున్నారు. ఇలాంటి వ్యక్తులున్న సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేస్తామనే నమ్మకం నాకు లేదు. అధికార పార్టీ పాపాలు పెరిగే కొద్ది ప్రజలతో కలిసి పోరాడుదాం.
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 మంది సభ్యుల బలంతో సభకు వెళ్లడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వానికి 164 మంది సభ్యులు ఉండడంతో వైసీపీ సభ్యులకు సభలో ఎక్కడో మూలన సీటింగ్ ఉంటుంది. ఇక అంశాలపై చర్చించేందుకు వారికి పెద్దగా సమయం కూడా ఇవ్వకపోవచ్చు. దీంతో అసెంబ్లీలో కంటే ప్రజల మధ్యే ఎక్కువగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.