Telugu Global
Andhra Pradesh

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్ ప్రభుత్వం

ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఇష్టమైన దగ్గర వైద్యం చేయించుకోవడానికి అనుమతి ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్ ప్రభుత్వం
X

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఉద్యోగులు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో కూడా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కార్డుల ద్వారా వైద్యం చేయించుకోవడానికి అనుమతులు జారీ చేసింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ వంతు కృషి చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులను పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నాళ్లుగానో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయంపై జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కేవలం రాష్ట్రంలోనే పరిమిత ప్రొసీజర్స్‌కు అనుమతి ఉంది. ఇకపై రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో 565 మెడికల్ ప్రొసీజర్స్‌ను ఉద్యోగులకు వర్తింప చేయనున్నారు.

ఈసీహెచ్ కింద ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఇష్టమైన దగ్గర వైద్యం చేయించుకోవడానికి అనుమతి ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఈసీహెచ్ స్కీమ్ ద్వారా ఆటో డెబిట్ చెల్లింపులు చేసేలా ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈసీహెచ్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే అవకాశం లభించనున్నది.

ఇక ఈసీహెచ్ ద్వారా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే ఉద్యోగులు, ఇతర లబ్ధిదారులకు సరైన సేవలు అందేలా సమన్వయం చేసేందుకు ఆరోగ్య మిత్రలకు కూడా ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులతో మంత్రుల కమిటీ భేటీ జరిగింది. ఆ సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు వెలువడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలనే డిమాండ్ పెండింగ్‌లో ఉంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు లభించే హైదరాబాద్, చెన్నైలకు ఉద్యోగులు వెళ్లే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

First Published:  13 Aug 2022 1:40 PM GMT
Next Story