బెయిల్ కోసం వైఎస్ భాస్కర్ రెడ్డి రిక్వెస్ట్.. సీబీఐ కోర్టులో పిటిషన్
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి కూడా విచారణని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఏడుసార్లు సీబీఐ ముందుకు వెళ్లిన అవినాష్ రెడ్డికి రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం సీబీఐ కోర్టుని ఆశ్రయించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపిస్తున్న సీబీఐ.. హత్య జరిగిన స్థలంలో వైఎస్ భాస్కర్ రెడ్డి సాక్ష్యాలను చెరివేసినట్లు చెప్తోంది. ఈ మేరకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డిపై కూడా విచారణ జరిపిన సీబీఐ ఏప్రిల్ 16న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ తనకి ఆరోగ్యం బాగా లేదని.. హత్య కేసులో తన పాత్రపై ఎలాంటి ఆధారాలూ లేకపోయినా అరెస్ట్ చేశారని సీబీఐ కోర్టుకి పిటీషన్ ద్వారా విన్నవించుకున్న భాస్కర్ రెడ్డి.. బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
వాస్తవానికి సీబీఐ కోర్టు ఇప్పటికే ఒకసారి వైఎస్ భాస్కర్ రెడ్డి రిక్వెస్ట్‌ని తిరస్కరించింది. అరెస్ట్ అయిన వెంటనే తనకి చంచలగూడ జైలులో ప్రత్యేక సౌకర్యాలు కావాలని భాస్కర్ రెడ్డి కోరారు. జీవన శైలి, సామాజిక హోదా, విద్య, ఆదాయపు పన్ను తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకి విన్నవించిన భాస్కర్ రెడ్డి న్యాయవాది.. సమాజంలో ఆయన ఒక గౌరవనీయమైన వ్యక్తి అని పేర్కొన్నారు. అంతేకాదు రాజకీయాల్లో ఉంటూ పేదలకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. చివరిగా వయసు, ఆనారోగ్య పరిస్థితులని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక వసతులు కల్పించమని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ.. సీబీఐ కోర్టు మాత్రం.. తీవ్రమైన నేరంలో భాస్కర్ రెడ్డి నిందితుడని.. కాబట్టి అతడ్ని ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో బెయిల్‌పై సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి కూడా విచారణని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఏడుసార్లు సీబీఐ ముందుకు వెళ్లిన అవినాష్ రెడ్డికి రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌కి ముందు తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ క్రమంలో వివేకానంద రెడ్డి హత్య కుట్ర కోణానికి సంబంధించి సీబీఐకి కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. దాంతో భాస్కర్ రెడ్డి కూడా తన బెయిల్ పిటీషన్‌లో ఎలాంటి ఆధారాలూ లేకపోయినా సీబీఐ అధికారులు తనని అరెస్టు చేసినట్లు ప్రస్తావించారు. అలానే సీబీఐ ఇప్పటికే దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ హత్యలో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొన్నారు. దాంతో ఈసారైనా భాస్కర్ రెడ్డికి ఊరట లభిస్తుందేమో చూడాలి.